మిగతాదంతా మీకే.. జగన్ తో తెల్చి చెప్పిన కేసీఆర్..!

‘‘గోదావరి నది నుంచి ఏటా 3,500 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం గరిష్ఠంగా 700 నుంచి 800 టీఎంసీలు మాత్రమే వాడుకోగలదు. మిగతా నీరంతా వాడుకునే వీలు ఏపీకి ఉంది. ప్రకాశం బ్యారేజీ ద్వారా సోమశిల వరకూ గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించి, రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చు. కేవలం రెండు లిఫ్టులతోనే గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు. ఆ నీటిని వాడుకుని ఏపీ రైతులకు సాగు నీరు ఇవ్వవచ్చు’’ అని ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ సూచించారు.

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తామని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకుంటే ఇరు రాష్ట్రాలూ సుభిక్షంగా ఉంటాయని చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ శనివారం సతీసమేతంగా ప్రగతి భవన్‌కు వచ్చారు. కేసీఆర్‌ను కలిశారు.ఈ సందర్భంగా, ‘‘ఇరుగు పొరుగు రాష్ర్టాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం మంచిదని మేం మొదటి నుంచీ భావిస్తున్నాం. నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీ్‌సను కలిశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర మధ్య ఉన్న జల వివాదాల కారణంగా దశాబ్దాలుగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై నేనే చొరవ తీసుకుని మాట్లాడాను. ‘లివ్‌ అండ్‌ లెట్‌ లివ్‌’ మా విధానమని చెప్పాను. వివాదాలు పరిష్కరించుకోవడం రెండు రాష్ర్టాలకు మేలని చెప్పాను. దీంతో, సహకరించడానికి మహారాష్ట్ర ముందుకొచ్చింది. ఫలితంగా, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌తో కూడా ఇలాంటి సంబంధాలనే కొనసాగించాలన్నది మా విధానం. రెండు రాష్ర్టాలకు మేలు కలిగేలా వ్యవహరిద్దాం’’ అని జగన్‌తో కేసీఆర్‌ అన్నారు. అనంతరం, సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఏపీతో మంచి సంబంధాలు నెలకొల్పుతామంటూ సీఎం కేసీఆర్‌ స్నేహ హస్తం అందించారని పేర్కొంది. ఇరు రాష్ట్రాలకు చెందిన అంశాలపై త్వరలోనే రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశమై అన్ని అంశాలను చర్చించుకోవాలని కేసీఆర్‌, జగన్‌ నిర్ణయించారని వెల్లడించింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, వైసీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన జగన్‌ను కేసీఆర్‌ అభినందించారు. జగన్‌ కాన్వాయ్‌ ప్రగతి భవన్‌కు రావడానికి ముందే పోర్టికో వరకూ వచ్చారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు కేసీఆర్‌ స్వయంగా వెళ్లి మరీ జగన్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

తొలుత పండ్ల బుట్టను, ఆ తర్వాత పూల బొకేను అందించారు. జగన్‌ సతీమణి భారతికి కేసీఆర్‌ సతీమణి శోభ, కేటీఆర్‌ సతీమణి శైలిమ స్వాగతం పలికారు. జగన్‌ను, ఆయన వెంట వచ్చిన వారిని తన అధికారిక నివాసంలోకి కేసీఆర్‌ తీసుకెళ్లారు. పోచంపల్లి ఇక్కత్‌ శాలువాను జగన్‌కు కప్పి సన్మానించి, కరీంనగర్‌ ఫిలిగ్రి జ్ఞాపికను బహూకరించారు. ఏపీ సీఎం బాధ్యతల్లో విజయవంతం కావాలని దీవించారు. ఈ సందర్భంగా, జగన్‌కు కేసీఆర్‌ స్వీట్లు తినిపించి సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం, రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలను జగన్‌కు పరిచయం చేశారు. ప్రగతి భవన్‌లో జగన్‌ దాదాపు గంటపాటు ఉన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కొద్దిసేపు చర్చలు జరిగాయి.