మరోసారి ఘోర అవమానం..! టీడీపీలోకి హిందూపురం వైసీపీ అభ్యర్దులు

హిందూపురం నియోజకవర్గ వైసీపీలో మరోసారి వర్గవిభేదాలు బయటపడ్డాయి. హిందూపురం వైసీపీ అభ్యర్థిగా మాజీ ఐజీ మహ్మద్‌ ఇక్బాల్‌సాబ్‌ను ఎంపిక చేశారు. ఇప్పటి వరకూ ఉన్న ననవీన్ నిశ్చల్‌కు… ఆ తర్వాత టీడీపీ నుంచి లాక్కున్న అబ్దుల్ ఘనీకి సరైన గౌరవం ఇవ్వకుండానే… పార్టీ కార్యక్రమాలు ప్రారంభించారు. తొలి సారి హిందూపురం వచ్చిన ఇక్బాల్‌కు స్వాగతం చెప్పేందుకు ఘనీ, నిశ్చల్ వచ్చారు. కానీ.. ర్యాలీ ప్రారంభమైన తర్వాత ఇద్దరూ వెళ్లిపోయారు. ర్యాలీ కొంతదూరం వచ్చాక వాహనంపై నుంచి అబ్దుల్‌ఘని దిగి వెళ్లిపోయారు.

చిలమత్తూరు మండలం అప్పనపల్లి క్రాస్‌ వద్దకు వచ్చేసరికి నవీన్‌నిశ్చల్‌ మరో వాహనంలో ముందుకు సాగారు. ఈ సందర్భంలో ఇక్బాల్‌ వాహనం ముందు కొంతమంది నవీన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో ఇక్బాల్‌ కారు దిగి కార్యకర్తలను మందలించారు.ఈ సందర్భంగా ర్యాలీలో నవీన్‌, ఇక్బాల్‌ మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. అయితే నవీన్‌నిశ్చల్‌ కాస్త సంయమనం పాటించి.. ముందుకు సాగారు. అయితే కొంతమంది కార్యకర్తలు మాత్రం మరింత రెచ్చిపోయారు. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ కారెక్కి చిలమత్తూరు వైపు ఇక్బాల్‌ కదిలారు. చిలమత్తూరు మెయిన్‌ రోడ్డు మీదుగా ఇక్బాల్‌తోపాటు మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి తన అనుచర వర్గంతో రోడ్డుపై నడుచుకుంటూ బీసీ కాలనీవరకు వెళ్లి అక్కడి నుంచి కారులో లేపాక్షికి చేరుకున్నారు. నవీన్‌నిశ్చల్‌ మాత్రం కొంతసేపు చిలమత్తూరులో ఆగి తరువాత నేరుగా హిందూపురం చేరుకున్నారు. రాత్రి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నవీన్‌నిశ్చల్‌ పాల్గొనకపోగా ఇంటివద్ద తన వర్గీయులతో సమావేశం ఏర్పాటు చేసి ర్యాలీ జరిగిన తీరుపై చర్చించారు. నవీన్‌ వర్గం లేపాక్షి, చిలమత్తూరులో ర్యాలీలో పాల్గొనకుండా వెనుదిరగడం చర్చనీయాంశంగా మారింది.

పురం వైసీపీలో మొదటి రోజే వర్గ విభేదాలు బయటపడడం, సమన్వయకర్తల మనసులు కలవకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే నవీన్‌నిశ్చల్‌ను టార్గెట్‌ చేసుకుని కొంతమంది అల్లరి మూకలు వాగ్వివాదానికి తెరలేపినట్లు ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. కనీస గౌరవం లభించే పరిస్థితి లేకపోవడంతో… వైసీపీకి గుడ్ బై చెప్పాలని వారిద్దరూ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.