ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మరో సంచలన ప్రాజెక్ట్ రద్దు

సస్యశ్యామలానికి మారుపేరు మన ‘తూర్పు’… ఎటుచూసినా పుష్కలంగా జలాలు.. కనుచూపుమేర పచ్చదనాలు.. సిరులు కురిపించే భూములు.. కానీ అక్కడ మాత్రం భూమి అంటే బంజరే… ఎప్పుడూ పగుళ్లతో చుక్కనీటి కోసం నేలలు నోళ్లు తెరుస్తాయి… వాన నీటి కోసం పరితపిస్తాయి.. దీంతో ఈ భూములే ఆధారంగా బతికే అక్కడి అన్నదాతలు అందరిలా వరిసాగు చేసుకునే భాగ్యం లేక దుంపల సాగుతో బతుకులీడుస్తారు.. అయితే వీరి తలరాతను మార్చడానికి గత ప్రభుత్వం హయాంలో ఈ ఏడాది ఆరంభంలో అడుగులు పడ్డాయి. రూ.132కోట్ల ఖర్చుతో ఏలేరు నుంచి నీటిని ఎత్తిపోసి 9 వేల ఎకరాలు తడపడానికి టెండర్లు పూర్తై పనులు మొదలయ్యాయి. కానీ గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు ఖరారైందనే ఒకే ఒక్క సాకుతో ప్రస్తుత సర్కార్‌ తాజాగా ఈ మల్లవరం-గోవిందపురం ఎత్తిపోతల పథకాన్ని రద్దుచేసేసింది. జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని గోక వరం మండలంలో గల మల్లవరం గ్రామం, జగ్గంపేట మండలంలోని గోవిందపురం, రంపచోడవరం నియోజక వర్గంలోని గంగవరం మండలం మొల్లేరు ప్రాంతంలో వేలాది ఎకరాలు బీడు భూములు ఉన్నాయి. కేవలం వర్షాలు పడితేనే ఇక్కడ పంటలు సాగవుతాయి. లేదంటే ఆ నేలల్లో ఏవీ మొలకెత్తవు. మల్లవరం, గోవిందపురం ప్రాంతాలు పూర్తిగా మెట్ట కాగా, మొల్లేరు ఏజెన్సీ పరిధిలోకి వస్తుంది. దీంతో ఇక్కడ రైతుల బతుకు కనాకష్టంగా మారింది.

జిల్లాలో ఇతర ప్రాంతాల్లో పుష్కల సాగునీటితో ఏటా మూడు పంటలు పండిస్తుంటే ఇక్కడున్న తొమ్మిది వేల ఎక రాల్లో ఒక్క పంట పండితే పండగ కింద లెక్కే. దీంతో చేసే దిలేక ఈ మూడు మండలాల గ్రామాల రైతులు కేవలం సగ్గు బియ్యానికి ఉపయోగించే దుంప పంటను పండించి బతుకులీడుస్తున్నారు. అటు తాగునీటికీ కటకటే. చుట్టూ చెరువులు ఉన్నా చుక్కనీరూ ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ ప్రాంతాన్ని చూస్తే జిల్లాలో ఇంత ఘోరంగా నీళ్లు లేని భూములు ఉన్నాయా? అని ముక్కున వేలేసుకునే పరిస్థితి. వాస్తవానికి రెండు నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే ఈ మూడు గ్రామాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఏలేరు రిజర్వాయర్‌ ఉంది. కానీ ఈ నీళ్లేవి వీరిని ఆదుకోవడం లేదు. ఈ ప్రాంతానికి సాగునీరు ఎత్తిపోతల ద్వారా ఇవ్వాలంటే విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు వెళ్లాల్సిన ఏలేరు నీటిలో కోత వేయాల్సిన పరిస్థితి. అధికారులేమో ఆ సాహసం చేయలేక ఈ మూడు గ్రామాలను గాలికి వదిలేశారు. దీంతో వర్షాన్ని మాత్రమే నమ్ముకుని అన్న దాతలు బతకాల్సిన పరిస్థితి.రాష్ట్రప్రభుత్వం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం ద్వారా కొంతనీరు అదనంగా ఏలేరు రిజ ర్వాయర్‌కు ఇవ్వడానికి మార్గం సుగమం అయ్యింది. అలా అదనంగా వచ్చే నీటిని ఏలేరు రిజర్వాయర్‌ నుంచి ఎత్తిపోసి ఈ మూడు గ్రామాల్లోని 9070 ఎకరాలకు పుష్కలంగా ఇవ్వ వచ్చని ఇంజనీర్లు రెండేళ్ల కిందట ప్రతిపాదించారు. జగ్గం పేట, రంపచోడవరం నియోజకవర్గాల పరిధిలోని మొల్లేరులో 3వేల ఎకరాలు, మల్లవరంలో 4వేల ఎకరాలు, గోవింద పురంలో 2070ఎకరాల చొప్పున ఇవ్వడానికి నివేదిక తయారుచేశారు. అటు మూడు గ్రామాల్లోని చెరువులనూ నింపేలా గోకవరం మండలం మల్లవరంలో ఎత్తిపోతల పథకం నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు అధ్య యనం చేసి రూ.132.79 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. గత టీడీపీ ప్రభుత్వం ఈ కీలక పథకానికి పచ్చజెండా ఊపింది. దీంతో ఏపీఎస్‌ఐడీసీ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 12న టెండర్లు పిలవగా హైదరాబాద్‌కు చెందిన వీబీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఈ పని దక్కించుకుంది.ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని ఆరు నెలల కిందట పనులు ప్రారంభించింది. ప్రాజెక్టు నిర్మాణం జరిగే మల్లవరం వద్ద భారీ ఎత్తున పైపులు సిద్ధం చేసింది. ఏలేరు రిజర్వాయర్‌ నుంచి నీటీని ఎత్తిపోసేందుకు వీలుగా యంత్రాలు మోహరించింది. ప్రాజెక్టు నుంచి ప్రతిపాదిత గ్రామాలకు పైపుల ద్వారా నీటిని తరలించేందుకు అలైన్‌మెంట్‌ మార్కింగ్‌ చేసింది. అక్కడక్కడా పైపులు కూడా బిగించింది. దీంతో తమ భూములకు సాగునీటి కరువు తీరబోతోందని ఈప్రాంత అన్నదాతలు సంబరపడ్డారు.

ఇంతటి కీలకమైన ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతోన్న తరుణంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని తాజాగా రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు 8శాతమే జరిగాయని, 25శాతం లోపు జరగనివన్నీ నిలిపివేయాలనే సీఎం ఆదేశాల మేరకు దీన్ని ఆపేయాలని ఉన్నతాధికారులు తాజాగా ఆదేశించారు. దీంతో ఇప్పుడు ప్రాజెక్టు భవితవ్యం అయోమయంలో పడింది. కాగా ఈ కీలక ప్రాజెక్టు ఆగిపోతే పథకం వ్యయం పెరుగిపో తుందని, తద్వారా ఇబ్బందులు వస్తాయని అధికారులు కలవర పడుతున్నారు. వాస్తవానికి ఇంతటి కీలకమైన ప్రాజె క్టును రద్దు చేయకుండా కొనసాగించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు తెచ్చేందుకు ఈ ప్రాంత అధికార పార్టీ ప్రజా ప్రతినిఽధులు ప్రయత్నం చేస్తే రద్దు నుంచి మినహాయింపు దక్కే అవకాశం ఉంది. కానీ ఆదిశగా చొరవ చూపకపోవ డంతో ఇతర ప్రాజెక్టుల్లాగే ఇది కూడా రద్దయిపోయింది. అటు కలెక్టర్‌ సైతం ఈప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించి రద్దు మినహాయింపు కోరినా ఉపయోగం ఉండేది. కానీ అటువంటి ప్రయత్నాలేవీ జరగకపోవడంతో ప్రస్తుతం ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

"
"