ఏకంగా తెలంగాణ నుండే ఏడుగురు.. టీటీడీ కొత్త బోర్డు సభ్యులు వీరే..?

తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పాలకమండలిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పూర్తిస్థాయిలో నియమించింది. ఏపీ నుంచి 8 మంది, తెలంగాణ నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ముగ్గురికి అవకాశమిచ్చారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి చెరొకరికి చాన్సు దక్కింది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చైర్మన్‌ సహా 29 మందితో అతిపెద్ద ధర్మకర్తల మండలి కొలువుదీరనుంది.29 మంది సభ్యుల బోర్డులో చైర్మన్‌ గాక 24 మంది సాధారణ సభ్యులు, నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులను నియమించారు. తెలంగాణ నుంచి ‘మైహోం’ జూపల్లి రామేశ్వరరావు, నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ, సీఎం కేసీఆర్‌ సన్నిహితుడు డి.దామోదర్‌రావు, హెటిరో అధినేత బి.పార్థసారథిరెడ్డి, ఆర్యవైశ్య సంఘం నేత మురంశెట్టి రాములు, యు.వెంకట భాస్కరరావు, వైసీపీ తెలంగాణ ప్రాంత నేతలు కొలిశెట్టి శివకుమార్‌, పుత్తా ప్రతాపరెడ్డికి బోర్డులో చోటు లభించింది.

ఏపీకి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి (పెనమలూరు-కృష్ణా), యూవీ రమణమూర్తి అలియాస్‌ కన్నబాబురాజు (యలమంచిలి-విశాఖ), మేడా మల్లికార్జునరెడ్డి (రాజంపేట-కడప), వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి, వైసీపీ ప్రొద్దుటూరు నగర అధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్‌కుమార్‌, పరిగెల మురళీకృష్ణ, నాదెండ్ల సుబ్బారావును బోర్డు సభ్యులుగా నియమించారు. తమిళనాడు నుంచి సీనియర్‌ న్యాయవాది కృష్ణమూర్తి వైద్యనాథన్‌, తెలుగు వైద్యురాలు డాక్టర్‌ నిశ్చిత ముప్పవరపు, అన్నాడీఎంకే ఎమ్మెల్యే కుమరగురు, ఇండియా సిమెంట్స్‌ అధినేత శ్రీనివాసన్‌కు స్థానం దక్కింది. కర్ణాటక నుంచి ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణమూర్తి భార్య సుధామూర్తికి ముచ్చటగా మూడోసారి అవకాశం దక్కింది. గత రెండు బోర్డుల్లోనూ ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ఆమె గాక ఈ రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు రమేశ్‌శెట్టి, రవినారాయణను సభ్యులుగా నియమించారు. ఢిల్లీ నుంచి ఎంఎస్‌ శివశంకరన్‌, మహారాష్ట్ర నుంచి రాజే్‌షశర్మకు అవకాశమిచ్చారు. బోర్డులో సింహభాగం రాష్ట్రేతరులే కావడం గమనార్మం. సభ్యులంతా సోమవారం శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. కాగా, దామోదర్‌రావు, భాస్కర్‌రావు, రాములు సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

బండి పార్థసారథిరెడ్డి
హెటిరో డ్రగ్స్‌ చైర్మన్‌. స్వగ్రామం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం కందుకూరు. స్వగ్రామంలో పాఠశాల విద్య, తర్వాత డిగ్రీ వరకు సత్తుపల్లి జేవీఆర్‌ కళాశాలలో చదివారు. ఉస్మానియా వర్సిటీలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆంధ్రా, తెలంగాణ సీఎంలు జగన్‌, కేసీఆర్‌కు సన్నిహితుడు.

మురంశెట్టి రాములు
సిద్దిపేటకు చెందిన వ్యాపారవేత్త. వైశ్య ప్రముఖుడు. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడు. ఏఎంసీ వైస్‌ చైర్మన్‌గా, వివిధ అసోసియేషన్‌లకు అధ్యక్షులుగా వ్యవహరించారు.

కొలిశెట్టి శివకుమార్‌
సామాజికఉద్యమకర్తగా ప్రస్థానం ప్రారంభించారు. 2004 నుంచి 2006 వరకు ఏపీఎ్‌సఆర్టీసీ ఎన్‌ఎంయూ అధ్యక్షుడిగా కొనసాగారు. 2010లో వైఎ్‌సఆర్‌సీపీలో చేరారు.

పుత్తా ప్రతా్‌పరెడ్డి
తొలినుంచి వైఎస్‌ కుటుంబానికి దగ్గరగా ఉన్నారు. వైసీపీలో కొనసాగుతున్నారు. జగన్‌కు సన్నిహితుడు.

జూపల్లి రామేశ్వర్‌రావు
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన జూపల్లి రామేశ్వర్‌రావు ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు. మైహోం గ్రూపు కంపెనీల వ్యవస్థాపక అధ్యక్షుడు. ఎన్నో సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చారు. జీయర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వేదిక్‌ అకాడమీ (జీవా) పేరుతో 80 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశారు.

దివకొండ దామోదర్‌రావు
తెలంగాణ ఉద్యమ తొలినాళ్ల నుంచి సీఎం కేసీఆర్‌ వెంట ఉన్న వ్యక్తుల్లో దివకొండ దామోదర్‌రావు ఒకరు. మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీగా కొనసాగుతున్నారు. 2011 నుంచి టీఆర్‌ఎ్‌సలో పలు హోదాల్లో పనిచేశారు. ఈయన స్వస్థలం జగిత్యాల జిల్లా మద్దునూరు.

"
"