మండలిలో ఉద్రిక్తత. రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తున్నారుగా…?

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఆకస్మికంగా రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. మండలి చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ ఇచ్చిన ఆదేశాలను పాటించలేనని పేర్కొంటూ అసెంబ్లీ-మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఆయనకు లిఖితపూర్వక సమాధానం పంపారు. మండలి చరిత్రలో ఇటువంటి పరిణామం ఇదే తొలిసారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. చైర్మన్‌ ఆదేశాలను ధిక్కరించినందుకు కార్యదర్శి సభా ధిక్కరణ విచారణ ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదే జరిగితే మండలి చరిత్రలో ఈ పరిణామం కూడా మొదటిసారే అవుతుంది. సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ (3 రాజధానులు) బిల్లులను సెలెక్ట్‌ కమిటీ పరిశీలనకు పంపాలని చైర్మన్‌ ఇచ్చిన ఆదేశాల తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో రెండు చట్ట సభలకు కలిపి ఒకే కార్యదర్శి ఉండడం సంక్లిష్టతను పెంచింది. మామూలుగా శాసనసభ, మండలికి వేర్వేరు కార్యదర్శులు ఉండాలి. కానీ ఇంతకు ముందు మండలి కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ పదవీ విరమణ తర్వాత ఆ స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు.అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణమాచార్యులే మండలికి కూడా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. శాసనసభలో వైసీపీకి, మండలిలో టీడీపీకి ఆధిక్యం ఉండడం.. రెండు సభలకు కలిపి ఒకే కార్యదర్శి ఉండడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది.

 

సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు వ్యవహారంలో తాము చెప్పినట్లే వినాలని అధికార పక్షం.. మండలిలో సంఖ్యాబలం ఉన్న తమ మాటే వినాలని విపక్ష టీడీపీ పట్టుబడుతున్నాయి. కార్యదర్శి అధికార పక్షం చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన ఆదేశాల మేరకు వెంటనే సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేసి బులెటిన్‌ విడుదల చేయాలని రెండు రోజుల క్రితం మండలి చైర్మన్‌ ఆయనకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల్లో తన ఆదేశాలు పాటించాలని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ తాను ఆ ఆదేశాలను పాటించలేకపోతున్నానని కార్యదర్శి శుక్రవారం పంపిన సమాధానంలో పేర్కొన్నట్లు సమాచారం. చైర్మన్‌ ఆదేశాలపై కొందరు సాంకేతిక అభ్యంతరాలు లేవనెత్తారని, అందువల్ల తాను ఆ ఆదేశాలను పాటించలేకపోతున్నానని ఆయన తెలిపారు. దీనితో సెలెక్ట్‌ కమిటీ వ్యవహారంలో పీట ముడి పడింది. కమిటీ ఏర్పాటు చేయాల్సిందేనని చైర్మన్‌ ఆదేశిస్తుంటే దానిని అమలు చేయడానికి కార్యదర్శి నిరాకరించడం కొత్త పరిణామం. మండలి చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ ఏర్పడలేదని.. ఒక రకమైన రాజ్యాంగ సంక్షోభాన్ని ఇది ప్రతిబింబిస్తోందని సీనియర్‌ రాజకీయవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.కార్యదర్శి తన అభిప్రాయాన్ని రాసి పంపడంతో దీనిపై ఏం చేయాలన్నదానిపై మండలి చైర్మన్‌ న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. మరోపక్క మండలిలో సంఖ్యాబలం ఉన్న టీడీపీ కూడా ఈ పరిణామాలపై చర్చిస్తోంది. చైర్మన్‌ ఆదేశాలను కార్యదర్శి నిరాకరించడంపై కోర్టుకెళ్తే ఎలా ఉంటుందన్నదానిపై ఆ పార్టీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఉన్న కొందరు సీనియర్‌ న్యాయనిపుణులు, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారి సలహాలను తీసుకునే ప్రయత్నంలో ఉంది.మండలి కార్యదర్శిపై సభా హక్కుల ధిక్కరణ అభియోగం మోపి విచారణ నిర్వహించాలన్న ప్రతిపాదనను కొందరు ఎమ్మెల్సీలు ముందుకు తెచ్చారు. మండలిలో సభాముఖంగా చైర్మన్‌ చేసిన ప్రకటన సభ నిర్ణయం కిందే లెక్కని, దానిని ధిక్కరించినందుకు కార్యదర్శిని సభాహక్కుల ఉల్లంఘన కింద విచారించాలని వారు సూచిస్తున్నారు. బడ్జెట్‌ సమావేశాల కోసం వచ్చే నెలలో మండలి సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లో కార్యదర్శిపై ధిక్కరణ అభియోగం కింద విచారణ చేపట్టే అవకాశముంది.

 

ఈ విచారణ రెండు రకాలుగా జరపవచ్చని ఎమ్మెల్సీలు చెబుతున్నారు. ఎమ్మెల్సీలు చేసిన ఫిర్యాదును సభాహక్కుల సంఘానికి పంపి ఆ సంఘం ఆధ్వర్యంలో విచారణ జరపడం ఒక పద్ధతి. నేరుగా సభ ముందుకే కార్యదర్శిని పిలిపించి అక్కడే విచారణ జరిపి తక్షణమే శిక్ష విధించడం రెండో పద్ధతి. కార్యదర్శిపై సభా హక్కుల విచారణ చేపడితే మండలి చరిత్రలో ఇదే ప్రఽథమమవుతుంది.సెలెక్ట్‌ కమిటీ ఫైలును మండలి కార్యదర్శి తిప్పిపంపడం సభా ధిక్కారమేనని, ఆయన తప్పు చేశారని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కార్యదర్శి వ్యవహార శైలిపై ఎమ్మెల్సీలెవరైనా ఫిర్యాదు చేస్తే సభాహక్కుల ఉల్లంఘన కింద విచారణ జరపాల్సి వస్తుందని చెప్పారు. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుపై ఏం చేయాలన్నదానిపై న్యాయనిపుణులతో మాట్లాడుతున్నామని, అన్ని మార్గాలూ తమకు తెరిచే ఉన్నాయని తెలిపారు.

"
"