కుప్పంలో ఏం జరిగింది… చంద్రబాబు మెజారిటీ తగ్గడం వెనుక కారణం ఇదేనా..?

రాష్ట్రంలో బలంగా వీచిన వైసిపి గాలి ప్రభావం చంద్రబాబు ఇలాకా… టీడీపీకి పెట్టని కోట కుప్పంపై కూడా చూపించింది. అక్కడా చంద్రబాబుకు వస్తుందనుకున్న మెజారిటీ తగ్గిపోయింది. ఇరుకు కారణాలు ఏమిటనేదానిపై ఇప్పుడు పోస్టుమార్టం మొదలైంది. కసిగా పనిచేసి ముఖ్యమంత్రి అభ్యర్థి మెజారిటీ తగ్గించడంలో విజయం సాధించాయి వైసీపీ శ్రేణులు. టీడీపీలోని స్థానిక నాయకులమీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వారికి ఆకాంక్షను ఈర్చడానికి బాగానే ఉపయోగపడింది. తమ అభ్యర్థి ఓడిపోయినా సరే.. ప్రత్యర్థి మెజారిటీ తగ్గించడాన్నే గెలుపుగా భావిస్తున్న వైసీపీ శ్రేణులు అమితోత్సాహంతో ఉన్నాయిప్పుడు.

అయితే వారిని కట్టుగా నిలబెట్టి, స్థానిక సమరానికి సన్నద్ధం చేయగల నాయకత్వ లేమి మాత్రం వైసీపీ శ్రేణులను బాధిస్తోంది. నిజానికి కుప్పం నియోజకవర్గంలో 1989 నుంచి తెలుగుదేశం అప్రతిహతమైన విజయం సాధిస్తూ వస్తోంది.మెజారిటీ అటూఇటూ అయినా సరే ఏడోసారి చంద్రబాబు కుప్పంనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అందువల్ల నియోజకవర్గంలో మొదటినుంచీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, లేకపోయినా స్థానికంగా పటిష్ఠ కార్యకర్తల బలం మాత్రం ఉం టూనే వస్తోంది. స్థానిక ఎన్నికల్లో మొత్తం నాలుగు మండలాల్లోనూ ఆ పార్టీయే అధికారాన్ని కైవశం చేసుకుంటోంది. ఈసారి మాత్రం కుప్పం నియోజకవర్గంలో సైతం చంద్రబాబు మెజారిటీ 2014 ఎన్నికలంటే సుమారు 16 వేల ఓట్లకు పైగా తగ్గిపోయి, కేవలం 30,273కు పరిమితమైంది. దీంతో టీడీపీ శ్రేణులు పూర్తిగా డీలాపడ్డాయి. అదే సమయంలో వైసీపీ శ్రేణుల్లో ఎక్కడలేని జోష్‌ను ఈ ఫలితాలు తీసుకొచ్చాయి. ఎమ్మెల్యే అభ్యర్థి కె.చంద్రమౌళి సారథ్యంలో పదేళ్లుగా పడ్డ కష్టానికి ఇప్పటికి వారికి ఫలితం దక్కినట్లైంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీని అదే అభ్యర్థి, 2009లో సాధ్యమైన 69 వేలనుంచి 47062కు తగ్గించగలిగారు.ఈ ఎన్నికల్లో అయితే 68,504 ఓట్లు సాధించగలిగారు. చంద్రబాబుకు 98521 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు, ఈసారి పోలైన ఓట్లకు మధ్య పెద్దగా సంఖ్యాపరంగా తేడా లేకపోయినా, నియోజకవర్గంలో పెరిగిన కొత్త ఓటర్లు వైసీపీవైపే మొగ్గడంతో ఆయన మెజారిటీ 30,273కు పడిపోయింది. మెజారిటీ ఇంతగా తగ్గించగలిగిందకు వైసీపీ శ్రేణులు ఆనందం అంతులేకుండా ఉంది. మొత్తం నాలుగు మండలాలలోనూ కౌంటింగ్‌ రోజున ఉదయంనుంచే ప్రారంభమైన వారి సంబరాలు ఆరోజు రాత్రిదాకా కొనసాగాయి. టీడీపీ స్థానిక నాయకులపై ప్రజల్లో గల వ్యతిరేకత, జగన్‌కు ఒక్క ఛాన్స్‌ ఇద్దామన్న ప్రజల ఆలోచనల్లో చంద్రబాబు మెజారిటీ తగ్గించగలిగిన వైసీపీ శ్రేణులను ఇప్పుడు నాయకత్వ లేమి బాధిస్తోంది. ఎన్నికల కోడ్‌ వెలువడకముందే అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన చంద్రమౌళి కౌంటింగ్‌కు వారం రోజులముందు కుప్పం వచ్చి ఒక్కరోజు మాత్రం ఉండి, తర్వాత వెళ్లిపోయారు. కౌంటింగ్‌ సమయంలో కూడా ఆయన కనిపించలేదు. ఫలితాలు వెలువడి అప్పుడే రెండు రోజులు గడిచిపోయాయి. అయితే నియోజకవర్గమంతటిలో వైసీపీకి నాయకత్వ కొరత ఏర్పడింది.

DCF compatable JPEG Img

పదేళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకులు ఉన్నారు. అదే సమయంలో కొత్తగా పార్టీలో చేరి సర్వశక్తులూ ఒడ్డి, ఓట్లు పెరగడానికి కృషి చేసిన నాయకులూ ఉన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ జెండాలను మోసి, తమకు ఏదో న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్న సామాన్య కార్యకర్తలకైతే కొదవే లేదు. చంద్రమౌళి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదన్న వార్తలు కుప్పంలో చక్కర్లు చేస్తున్నాయి. స్థానికంగా తమకు కావాల్సిన పనులు చేసిపెట్టేందుకు ఏ నాయకుడిని ఆశ్రయించాలో వైసీపీలోని చోటా నేతలకు, కార్యకర్తలకు తెలియడంలేదు. త్వరలోనే స్థానిక ఎన్నికలున్నందున టికెట్లపైనా, పార్టీ పదవులపైనా ఎవరి ఆశలు వారికున్నాయి. తమనందరినీ ఏకతాటిపై నడిపే నాయకుడు కొరవడడంతో నియోజకవర్గంలో ఎవరికివారుగా గ్రూపులు కట్టే పరిస్థితి కనిపిస్తోంది.