కోడెల ఓటమికి కారణం ఇదే.. సత్తెనపల్లిలో ఏం జరిగింది

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు భారీ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీకి గుండెకాయలా నిలిచింది సత్తెనపల్లి మండలం. అయితే ఈ ఎన్నికల్లో మండలంలో తెలుగుదేశం పార్టీ తన పట్టును కోల్పోయింది. ఎన్నికలు ఏవైనా ఫలితాలలో ముందుండే మండలం నేడు డీలా పడింది. వైసీపీ జోరు వల్ల గత ఎన్నికలతో పోల్చుకుంటే మండలంలో టీడీపీ మెజార్టీ వేలల్లో తగ్గింది.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 3 వేల 338 ఓట్ల మెజార్టీ సాధించగా ఈ ఎన్నికల్లో మెజార్టీ 868 ఓట్లకు పడిపోయింది.అంతేకాకుండా గత ఎన్నికల్లో అబ్బూరులో 627, భీమవరం 506 మెజార్టీరాగా ఈ ఎన్నికల్లో ఆ మెజార్టీ తగ్గింది. 2014లో ధూళిపాళ్ళలో టీడీపీకి 553 ఓట్ల మెజార్టీ రాగా ఈ ఎన్నికల్లో వైసీపీకి 85 ఓట్ల మెజార్టీ వచ్చింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన రెంటపాళ్ళ, కట్టమూరు, గోరంట్ల, గండ్లూరు, లక్కరాజుగార్లపాడు గ్రామాల్లో మెజార్టీ రాగా ఈసారి ఈ గ్రామాల్లో వైసీపీకి మెజార్టీ వచ్చింది. నందిగామలో గత ఎన్నికల్లో 1161 ఓట్ల మెజార్టీ తెలుగుదేశానికి రాగా ఈ ఎన్నికల్లో 93 ఓట్లు తగ్గి 1068 ఓట్ల మెజార్టీ వచ్చింది.గత ఎన్నికల మాదిరి ఈ ఎన్నికల్లో భట్లూరు, గుజ్జర్లపూడి, దీపాలదిన్నెపాలెం, ఫణిదం, గుడిపూడి, కట్టావారిపాలెం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ పట్టు నిలుపుకుంది. మండలంలో 59 వేల 311 మంది ఓటర్లు ఉండగా 54 వేల 694 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.

పోలైన ఓట్లలో టీడీపీకి 26 వేల 453, వైసీపీకి 25 వేల 585, జనసేనకు 1329 ఓట్లు వచ్చాయి. గ్రామాల వారీగా టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థులకు పోలైన ఓట్లు, వచ్చిన మెజార్టీ కింది విధంగా ఉన్నాయి. నకరికల్లు మండలంలో వైసీపీ అభ్యర్థికి 5546 ఓట్ల ఆధిక్యం లభించింది. మండలంలో మొత్తం ఓట్లు 51,505 కాగా 42,848 ఓట్లు పోలయ్యాయి. 22,141 ఓట్లు వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకు రాగా, 17,275 ఓట్లు టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుకు వచ్చాయి. జనసేన అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డికి 2368 ఓట్లు లభించాయి.