కియా మూసివేత…. కరోనా ఎఫెక్ట్…

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్, జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇండియా యమహా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారత్‌లో నేటి నుంచి ఉత్పత్తిని నిలిపివేశాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. వినియోగదారులు, కార్మికులు, సిబ్బంది, భాగస్వాముల శ్రేయస్సు, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కియా మోటార్స్ తెలిపింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది పేర్కొంది.ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, కంపెనీ కార్యాలయాన్ని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేయనున్నట్టు తెలిపింది. కాగా, కియా సోదరి సంస్థ హ్యుందయ్ మోటార్స్ లిమిటెడ్ ఆదివారమే తమ చెన్నై యూనిట్‌లోని ఉత్పత్తిని నిలిపివేసింది.

 

కరోనా వైరస్ భయాందోళనల నేపథ్యంలో ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) ప్రైవేటు లిమిటెడ్ కూడా నియంత్రణ చర్యలు చేపట్టింది. తమిళనాడులోని చెన్నై, ఉత్తరప్రదేశ్‌లోని సూరజ్‌పూర్, హర్యానాలోని ఫరీదాబాద్‌ ప్లాంట్లలో ఈ నెల 31 వరకు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ఈ రోజు ప్రకటించింది. కాగా, ఉద్యోగుల రక్షణ దృష్ట్యా ఉత్పత్తిని నిలిపివేయాలంటూ ఆటో మేకర్స్, విడిభాగాల తయారీదారులను ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ లాబీ గ్రూప్ సియామ్ ఆదేశించింది.మరోవైపు, దేశంలోని అతిపెద్ద వాహన తయారీదారు అయిన మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఆదివారం ఉత్పత్తిని నిలిపివేసింది. మరో ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న తమ యూనిట్లతోపాటు కొలంబియా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఉన్న యూనిట్లలోనూ ఉత్పత్తిని నిలిపివేసింది. ఎఫ్‌సీఏ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, మహింద్ర అండ్ మహింద్ర, టాటా మోటార్స్ వంటి సంస్థలు కూడా ఉత్పత్తిని నిలిపివేశాయి.

"
"