కార్మిక మంత్రిగా పితాని.. త‌నకు తానే సాటి..!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన పితాని స‌త్య‌నారాయ‌ణ రికార్డు సృష్టిస్తున్నారు. అంద‌రినీ క‌లుపుకొని పోతున్న నాయ‌కుడిగా ఆయ‌న గతంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్ప‌టి నుంచి పేరు తెచ్చుకున్నారు. పార్టీల‌కు అతీతంగా అంద‌రినీ క‌లుపుకొని పోతూ.. ప్ర‌తి ఒక్క‌రిలోనూ మంచి నాయ‌కుడిగా గుర్తింపు సాధించారు. 2014లో కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌త్య‌నారాయ‌ణ‌.. అప్ప‌టి రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకు న్నారు. వాస్త‌వానికి అప్ప‌టి వ‌ర‌కు కూడా కాంగ్రెస్ నేత‌గా ఉన్న పితాని టీడీపీ నుంచి గెలుస్తారా ? అనే సందేహం వ‌చ్చింది . కానీ, ప్ర‌జ‌ల‌లో త‌న‌కంటూ ఇమేజ్‌ను సంపాయించుకున్న ఈయ‌న‌కు గెలుపు గుర్రం ఎక్క‌డం పెద్ద క‌ష్టం కాలేదు.

ఆ వెంట‌నే చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పిస్తార‌ని ఆశించినా.. 2017 వ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్ప‌లేదు. వివిధ సామాజిక వ‌ర్గీక‌ర‌ణ‌లు, స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో 2017లో బాబు త‌న కేబినెట్‌లోని తీసుకున్నారు. పితానికి కార్మిక శాఖ‌ను అప్ప‌గించారు. సాధారంగా ఈ శాఖ అంటే పెద్ద‌గా ప‌ని ఏముంటుంద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. కానీ, పితాని మాత్రం త‌న ప‌నితీరును న‌మ్ముకుని ఇదే శాఖ‌ను కీల‌కంగా నిలిపేందుకు ప్ర‌య‌త్నించారు. మంత్రిగా బాధ్య‌తలు తీసుకున్న నాటి నుంచి ఆయ‌న వేసిన ప్ర‌తి అడుగు కీల‌కంగా మారింది. రాష్ట్ర విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీకి పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌ల ను ఆహ్వానించి, ఇక్క‌డ ఏర్పాటు చేయ‌డం ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగాన్ని పార‌దోలాల‌ని నిర్ణ‌యించుకున్న చంద్ర బాబు విజ‌న్‌కు అనుగుణంగా పితాని అడుగులు వేశారు.

మంత్రి లోకేష్‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. వివిధ దేశాలు తిరుగుతూ.. ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆహ్వానించే కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు. అదేస‌మ‌యంలో త‌న జిల్లా ప‌శ్చిమ గోదావ‌రిలో కీల‌క‌మైన ఆక్వా ప‌రిశ్ర‌మ‌కు మ‌రింత ఊపు నిచ్చేలా నిరుద్యో గుల‌కు అవ‌కాశం క‌ల్పించేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. కార్మికుల‌కు క‌నీస వేత‌నం అమ‌లు, సెల‌వులు వంటి అంశాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ఖ‌చ్చితంగా అమ‌ల‌య్యేలా చూశారు. అదేస‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన ప‌థ‌కం చంద్ర‌న్న బీమాను కూడా పితాని ప్ర‌త్యేకంగా భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీమాను పెద్ద ఎత్తున అమ‌ల‌య్యేలా చూశారు.

బీమా ప్రీమియంను అవ‌స‌ర‌మైతే.. కార్మికులు ప‌నిచేస్తున్న ప‌రిశ్ర‌మ‌ల‌తోనే క‌ట్టించేలా ఏర్పాటుచేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాల‌కు వెంట‌నే ప‌రిహారం అందేలా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోవ‌డంతోపాటు.. ఈ ప‌థ‌కం ద్వారా ఇలు ప్ర‌జ‌లకే కాకుండా చంద్ర‌బాబు, పార్టీకి కూడా పెద్ద ఎత్తున ప్ర‌చారం, ల‌బ్ధి పొందేలా తీసుకున్న చ‌ర్య‌లు, వేసిన అడుగులు రాష్ట్రంలో పార్టీకి ఊత‌మిచ్చాయి. త‌న‌దైన అనుభ‌వం, శైలితో ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోతూ.. అభివృద్ధే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న పితానికి అటు నియోజ‌క‌వ‌ర్గం, ఇటు పార్టీలోనూ తిరుగులేని నేత‌గా గుర్తింపు ల‌భించింది.