కన్నా కాదు.. సుజనానే..! బీజేపీ గేమ్‌ ప్లాన్ షురూ..!

బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో.. మాజీ కేంద్రమంత్రి సుజనాచౌదరిని.. ఏపీలో ప్రమోట్ చేయాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు… ఏపీకి వచ్చి.. సుజనా చౌదరి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడుతుందని ప్రకటనలు చేస్తున్నారు. ఓ వైపు కన్నా లక్ష్మినారాయణ ఉండగానే.. ఇలాంటి ప్రకటనలు ఉత్తరాది నుంచి వచ్చిన నేతలు చేసేస్తున్నారు. దీంతో.. అవాక్కవడం.. కన్నా లక్ష్మినారాయణ వంతు అవుతుంది. కానీ బీజేపీ నేతలు మాత్రం.. ఈ విషయంలో పట్టింపులకు పోరు. తాము ఏమనుకుంటున్నారో అదే చేస్తారు కాబట్టి… ముందుకే వెళ్తున్నారు.

కొద్ది రోజులుగా.. ఏపీలో తెగ తిరిగేస్తున్న బీజేపీ ఇన్చార్జ్ సునీల్ థియేధర్.. సుజనాను ఆకాశానికెత్తేస్తున్నారు. ఆయన నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందని చెబుతున్నారు.సుజనా చౌదరి… ప్రత్యక్ష రాజకీయాల నుంచి వచ్చిన నేత కాదు. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం రీత్యా… ఆయనకు పదవులు లభించాయి. ఆయన కృష్ణా జిల్లా బంధువుర్గం ఉన్నప్పటికీ.. ఫలానా నియోజకవర్గం అంటూ ఏమీ లేదు. టీడీపీ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఇప్పుడు.. బీజేపీ నేతగా ప్రమోట్ చేయడానికి కమలం నేతలు ప్రయత్నిస్తున్నారు. లేని బలంగా ర్యాలీలు నిర్వహించి.. ప్రజానాయకుడిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది బీజేపీలో సుదీర్ఘ కాలంగా ఉన్న నేతలు అసంతృప్తికి గురవడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ.. ఎవరూ నోరెత్తలేరు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ్యులతో బలపడిపోవాలని బీజే్పీ చాలా తీవ్రమైన ప్రయత్నాలే చేస్తోంది. అందులో భాగంగా… నాయకత్వం ఎవరిది కాబోతుందో కూడా..నేరుగానే చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ ఉన్నారు. ఆయన గతంలో… బీజేపీ నుంచి వైసీపీలో చేరబోయి.. ఆగిపోయి.. ఏపీ బీజేపీ అధ్యక్షుడైపోయారు.

లేకపోతే.. ఈ పాటికి … పెదకూరపాడు నుంచో.. మరో చోటు నుంచో.. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయి ఉండేవారేమో..?. కానీ ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉండిపోవడంతో.. నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. పట్టుమని పది వేల ఓట్లు తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు ఆయన నాయకత్వానికి బీజేపీ హైకమాండ్ మెల్లగా టెండర్ పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.