కాకినాడ ఎంపీగా ఆయనే..! నరసింహం కన్నా గట్టి లీడరే..‍!?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ తోట నర్సింహం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. మంగళవారం సీఎం చంద్రబాబుతో ఎంపీ తోట, ఆయన కుటుంబసభ్యులు సమావేశమై ఈ విషయాన్ని తెలియజేశారు. అనారోగ్యం కారణంగా ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సీఎంకు తెలిపారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట అసెంబ్లీ టికెట్‌ను తన సతీమణికి ఇవ్వాలని బాబును ఎంపీ కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీలు మారేటప్పుడు నేతలు విమర్శలు చేయడం సహజమని వ్యాఖ్యానించారు. తాను మాత్రం టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తన ఆరోగ్యం బాగాలేనందున తమ కుటుంబంలో ఒకరికి జగ్గంపేట అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు ఎంపీ తోట నర్సింహం తెలిపారు.

దివంగత టీడీపీ కీలక నేత.. అమలాపురం కీలక నేత మెట్ల సత్యనారాయణ అల్లుడు తోట నరసింహం. అయితే ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. వైఎస్ హయాంలో మంత్రిగా కూడా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి.. గెలుపొందారు. ఆయితే ఆయన నియోజకవర్గం జగ్గంపేట. అక్కడనుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఉన్నారు. ఆయనకు టీడీపీ నుంచి టిక్కెట్ ఖాయమే. చంద్రబాబు.. తోట నరసింహం ఫ్యామిలీకి.. ఎక్కడ టిక్కెట్ కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన భార్య కొంత కాలం నుంచి చురుగ్గా రాజకీయాలు చేస్తున్నారు.

కొన్నాళ్ల కిందట ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ.. ఆయన టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. కాకినాడ ఎంపీ స్థానం నుంచి ఈ సారి ఆయన పోటీ చేయరు. అందుకే.. ప్రత్యామ్నాయంగా మరో నేత సునీల్ ను.. పార్టీలోకి తీసుకునేందుకు చంద్రబాబు ప్రణాళిక సద్ధం చేశారు. ఆయన ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన పార్టీలో చేరుతారని చెబుతున్నారు.