కడప వర్సెస్ జమ్మలమడుగు..! టీడీపీలో ఏం జరుగుతోంది..?

జమ్మలమడుగు పంచాయతీని తేల్చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. వారం రోజుల్లో చంద్రబాబుతో.. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి మూడు సార్లు సమావేశం అయ్యారు. ఈ రోజు కూడా… ఉదయమే.. చంద్రబాబుతో చర్చలు జరిపారు. కానీ ఏ విషయం తేలలేదు. కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు… ఆదినారాయణకు ఆ జిల్లా బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నారు. కడప లోక్‌సభా నియోజకవర్గం మొత్తం ఆయనకే అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా.. ఆయన మాటకే విలువ ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆదినారాయణరెడ్డి పట్టుబడితే.. ఆయనకే టిక్కెట్ ఖరారు చేస్తారని చెబుతున్నారు. దీనికి రామసుబ్బారెడ్డి అంగీకరిస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఆయనను బుజ్జగించి.. పార్లమెంట్ కు పోటీ చేసేలా అంగీకరించడం లేదా.. మరో మార్గం అన్వేషించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

దశాబ్దాల పాటు ఫ్యాక్షన్ వర్గాలను నడిపి… ప్రత్యర్థులుగా కన్నా..శత్రువులుగా ఎక్కువ కాలం గడిపిన ఆదినారాయణరెడ్డి, రామ సుబ్బారెడ్డి ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. రామసుబ్బారెడ్డి.. టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. కానీ ఇద్దరూ టీడీపీలో ఉండటం వల్ల ఒక్కరికే టిక్కెట్ వస్తుంది. ఒకరు జమ్మలమడుగు అసెంబ్లీకి.. మరొకరు కడప పార్లమెంట్‌కు పోటీ చేయాల్సి ఉంటుందని ఎవరు ఎక్కడ్నుంచి పోటీ చేస్తారో తేల్చుకోవాలని… వారికి చెప్పేశారు. వారు మాత్రం తమ అనుచరులతో మాట్లాడాలని.. టైం తీసుకుంటున్నారు.

కొంత మంది పార్టీ నేతలకు ఇద్దరు నేతల మధ్య సమన్వయం కుదిర్చే బాధ్యతను అప్పగించారు. చాలా రోజుల నుంచి… ఆ నేతలు సమన్వయం కోసం ప్రయత్నం చేస్తున్నా… ఇద్దరూ ఒకే మాట మీద ఉన్నారు. ఇద్దరికీ..అసెంబ్లీ టిక్కెట్ కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. పార్లమెంట్ కు పోటీ చేయడానికి సిద్ధపడటం లేదు. ఇద్దరూ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలనుకుంటున్నారు. జమ్మలమడుగుకు దూరం జరిగితే.. మొత్తానికే పట్టుకోల్పోతామని భయపడుతున్నారు. అందుకే ఇద్దరూ.. అసెంబ్లీ వైపే చూస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఒకర్ని పార్లమెంట్‌ కు పంపాలని నిర్ణయించారు.