రాసి పెట్టుకోండి చంద్రబాబు రికార్డులు ఇవే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఈ నాలుగేళ్లలో చేసిందేమిటి? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు? ఈ ప్రశ్నలకు జవాబులే లోకేష్ చెప్పిన ఈ గణాంకాలు. సీఎం చంద్రబాబు గత నాలుగున్నరేళ్లలో చేసిన కృషి వల్ల ఇప్పటి వరకూ రాష్ట్రంలో 54 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, 2 బిలియన్‌ అమెరిన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టడం ద్వారా 22 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని మంత్రి లోకేష్ వివరించారు. ‘నేను ఐటీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు రాష్ట్రంలో 2 లక్షల ఐటీ ఉద్యోగాలు, లక్ష ఎలక్ట్రానిక్‌ రంగ ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. దానికోసం నిరంతం పనిచేస్తున్నాం’ అని లోకేశ్‌ తెలిపారు. ఆంధ్రాలో కార్బన్‌ మొబైల్స్‌ కంపెనీ తయారు చేసిన సరికొత్త వి9 ప్రో మోడల్‌ సెల్‌ఫోన్‌ను మంత్రి లోకేశ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సీఎం చంద్రబాబు తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్ల నాలుగేళ్లలోనే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపైంది. 2014లో రాష్ట్రం నుంచి మొబైల్స్‌ తయారీ అన్న మాటే లేదు. ఇప్పుడు దేశంలో మొబైల్‌ ఫోన్స్‌ తయారీ రంగంలో ఏపీ వాటా 26 శాతంగా ఉంది. మేకిన్‌ ఇండియా నినాదం మేడిన్‌ ఏపీగా మారింది’ అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా, ప్రత్యేకించి సీఎం చంద్రబాబుపైనా పారిశామ్రికవేత్తలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని తిరుపతి ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ 1, 2లలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న వోల్టాస్‌, ఎక్స్‌ట్రాన్‌ తదితర పది పరిశ్రమల నిర్మాణానికి ఆదివారం లోకేశ్‌ శంకుస్థాపన చేశారు. రూ.1018 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్న ఈ సంస్థల్లో 4,226 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అలాగే క్లస్టర్‌1లోని 15 ఎకరాల్లో రూ.300 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉపాధి కల్పించేలా నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తికి సిద్ధమైన కార్బన్‌ మొబైల్‌ ఫోన్స్‌ తయారీ యూనిట్‌ను కూడా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కంపెనీ ఉద్యోగులు, వివిధ ఇంజనీరింగ్‌ కళాశాలలు, ఐఐటీ విద్యార్థులనుద్దేశించి లోకేశ్‌ ప్రసంగించారు.‘దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు సమర్థవంతమైన పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా నాలుగేళ్ల కిందట సున్నాగా ఉన్న ఏపీ స్థానం, స్వల్ప వ్యవధిలోనే దేశంలో నాలుగో స్థానానికి చేరుకుంది’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తల ప్రయోజనాలను కూడా పరిరక్షించి వారి పెట్టుబడులకు భద్రత కల్పించాల్సి ఉందన్నారు.

‘ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల తయారీకి సంబంధించి తిరుపతిలోనే లక్ష ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నాము. తాజాగా శంకుస్థాపన చేసిన పది పరిశ్రమలు, ప్రారంభించిన ఒక పరిశ్రమ వల్ల రూ.1500 కోట్ల పెట్టుబడులు, 7 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. దేశంలో టీవీ ప్యానెళ్లు తయారు చేసే ఏకైక రాష్ట్రం ఏపీయే. గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌లో ఏపీ వాటా పదిశాతంగా ఉండడం గర్వించదగ్గ పరిణామం. రాబోయే పరిశ్రమలకు కూడా వర్క్‌ఫోర్స్‌ను అందించగలిగేలా రాష్ట్రం నుంచీ ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ నిపుణులను తయారు చేయాల్సిన అవసరముంది. ఆ క్రమంలోనే తొలిదశలో 15 వేల మంది విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాం’ అని లోకేశ్‌ వివరించారు.