జనసేన అలా…. జగన్ పార్టీ ఇలా… రఘువీరా సంచలన కామెంట్స్

ఒకవైపు బీజేపీ, టిఆర్ఎస్ కలిసి జగన్ ని ముందు పెట్టి రాజకీయం చేస్తున్నాయని ఆంధ్రాలో అత్యధిక సరమ్మంది ప్రజలు అనుమానిస్తున్నారు. అదే సమయంలో వైసిపితో పాటు జనసేన ను కూడా కలిపి ఈ ఇద్దరితో బీజేపీ ఆంధ్రాలో రాజకీయ ఆట మొదలు పెట్టిందన్న అభిప్రాయమూ ఉంది. ఈ తరుణంలో తనపై ఉన్న ముద్రను తొలగించుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. కొన్నాళ్లుగా జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీతో తాను అంటకాగడం లేదని చెప్పుకునే ప్రయత్నం జనసేనాని చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ఏపీ చీఫ్ రఘువీరారెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పవన్ నాయకత్వంలోని జనసేన ఇంకా మొలకెత్తని పార్టీ అని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఇక జగన్ నాయకత్వంలోని వైసీపీ అయితే ఆకులు రాలిపోయిన పార్టీ అని తేల్చేశారు. జనసేన పార్టీకి తమకి పోటీ ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి వందేళ్లపైగా చరిత్ర ఉంటే జనసేన పార్టీ ఇంకా మెులకెత్తలేదని రఘువీరారరెడ్డి విమర్శించారు.

ఇక కాంగ్రెస్ వనవాసం పూర్తి అయిందని వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని రఘువీరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను సిద్ధం చేసేందుకు పీసీసీ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తోంది. ఎన్నికలు, ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంలో ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రఘువీరారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అన్ని పార్టీల కంటే తామే ముందు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 7నుంచి 10వరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

ఏఐసీసీ గైడ్ లైన్స్ ప్రకారం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తామని తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరులోగా అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఇంటింటికీ కాంగ్రెస్‌ కార్యక్రమం బాధ్యతలు అప్పగిస్తామని, అభ్యర్థులు నేరుగా రాహుల్‌గాంధీతో అనుసంధానమయ్యేలా చేస్తామని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 4నుంచి ప్రత్యేక హోదా భరోసా యాత్రం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక హోదా భరోసా యాత్రకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీలను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సభలు, సమావేశాలు నిర్వహించాలని తీర్మానించినట్లు తెలిపారు. 84 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాల్లో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ భరోసాయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు.