జనసేనకు షాక్… ఆ పార్టీ ఎమ్మెల్యేని ముంచిన కేసు

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు పోలీసులు షాకిచ్చారు. రాజోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాపాకను అరెస్టు చేయడానికి పోలీసులు సర్వం సిద్ధం చేస్తున్న తరుణంలో ఆయనే పోలీసులకు లొంగిపోయారు. దాంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మలికిపురం పోలీస్ స్టేషన్‌పై దాడి కేసులో రాపాకతో పాటు.. ఆయన అనుచురులు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో రాపాకపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పేకాట ఆడుతున్నారన్న అభియోగంపై ఎమ్మెల్యే అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దీంతో అతన్ని విడిపించడానికి ఎమ్మెల్యే వరప్రసాద్ తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆ సందర్భంగా పోలీసులకు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో ఎమ్మెల్యే అనుచరులు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసినట్లు ఆరోపిస్తూ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ అరెస్టుకి రంగం సిద్ధమైంది. ముదస్తుగా రాపాక ముఖ్య అనుచరులను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రాపాక ఇంటికి చేరుకోవడంతో అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణ నెలకొంది.కేసు విషయంపై ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశారు. ఆ సమయంలో ఎస్సై…ఏక వచనంలో మాట్లాడటంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మలికిపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ఆందోళన చేపట్టారు. దీనిపై పోలీసుల ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో జనసేన కార్యకర్తలంతా ధర్నాకు దిగారు. ఈ ధర్నా నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పై దాడి చేశారంటూ… ఎమ్మెల్యే రాపాకపై కేసు నమోదైంది.

అరెస్టుకి ముందే రాపాక లోంగిపోవడంతో గమనార్హం. స్వచ్ఛమైన రాజకీయం మా లక్ష్యం అని జనసేన అధినేత పవన్ నిత్యం చెబుతుంటే ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఇప్పుడు అనుచరుడి పేకాట కేసులో సర్దుబాటు చేయబోయి ఇరుక్కోవడం ఆ పార్టీ వర్గాల్లోనే కాదు రాష్ట్ర ప్రజాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.