జగన్ నువ్వు ఇలాగే వుంటే చాలా కష్టం

అమరావతి తరలింపుపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్‌పై ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి తరలించే అవకాశం ఉందన్న చర్చ జోరందుకుంది. ఇటీవలి వరదలకు రాజధాని ప్రాంతం ముంపుకు గురవడంతో.. అలాంటి చోట రాజధాని నిర్మాణం మంచిది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తుండటంతో.. దీనిపై వాడి వేడి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. ‘చిన్నప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చరిత్ర పుస్తకాల్లో చదివాము. 1328 సంవత్సరంలో ఢిల్లీ నుంచి రాజధాని మహారాష్ట్రలోని దౌలతాబాద్‌కు.. తిరిగి అక్కడినుంచి ఢిల్లీకి మారింది. మీరు తుగ్లక్‌ లాగా చరిత్రలోకి ఎక్కకూడదని భగవంతుడిని కోరుకుంటున్నాను’ అని అందులో వ్యాఖ్యానించారు. జగన్ గారు అని సంబోధిస్తూనే తుగ్లక్ చర్యలకు పాల్పడవద్దంటూ కేశినేని జగన్‌కు చురకలంటించారు.

ఇదిలా ఉంటే, ఒకవేళ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ప్రత్యామ్నాయం ఏంటన్న చర్చ కూడా జరుగుతోంది. గతంలో వినిపించిన దొనకొండ పేరు ఇప్పుడు మరోసారి బలంగా తెర పైకి వస్తోంది. అయితే వైసీపీ అధినేత జగన్ మదిలో ఏముందన్నది తెలియాల్సి ఉంది. నిజంగానే రాజధానిని తరలించే యోచనలో ఆయన ఉన్నారా..? లేక ఇదంతా వట్టి హడావుడిగానే మిగిలిపోతుందా అన్నది భవిష్యత్‌లో తేలిపోనుంది.