జగన్ మరో సంచలన నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. ఏపీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రణాళిక మండలిని రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటి స్ధానంలో మొత్తం 13 జిల్లాలకు కలిపి నాలుగు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ప్రాంతాల మధ్య అసమానతల తొలగింపు, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారించడం ద్వారా అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

విజయనగరం జిల్లా కేంద్రంగా ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాలైన శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్టణం ఉత్తరాంధ్ర ప్రాంతీయ ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాకినాడ కేంద్రంగా తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలతో ప్రాంతీయ ప్రణాళిక బోర్డు.. గుంటూరు కేంద్రంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డు.. కడప కేంద్రంగా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం ప్రాంతీయ ప్రణాళిక బోర్డులకు కేబినెట్‌ స్థాయి ర్యాంకులో మూడేళ్ల కాల వ్యవధికి చైర్మన్‌ లను నియమించనున్నారు. దీంత పాటు వ్యవసాయం,నీటి నిర్వహణ, మౌలిక వసతులు, సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమ రంగాలకు చెందిన నలుగురు నిపుణులను సభ్యులుగా నియమిస్తారు.