జగన్ కోపమే ఆంధ్రాకు శాపం.. బయట పెట్టిన ఏబీఎన్ అర్కే..?

‘‘నా రూటే సెపరేటు’’ అని ఒక సినిమాలో మోహన్‌బాబు చెప్పిన డైలాగ్‌ ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తన రూటే సెపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం రాష్ట్రాన్ని హడలెత్తిస్తున్నారు. మీరు నడుస్తున్న దారి సరైనది కాదని కేంద్ర పెద్దలతోపాటు పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులు హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రి పెడచెవిన పెడుతున్నారు. జగన్మోహన్‌రెడ్డి చర్యలు ప్రభుత్వ టెర్రరిజాన్ని తలపిస్తున్నాయనీ, రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయనీ మోహన్‌దాస్‌ పాయ్‌ అనే ప్రముఖుడు తాజాగా హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టుకు రీటెండర్లు వద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఆర్కే జైన్‌ శుక్రవారం మళ్లీ హెచ్చరించారు. అయినా జగన్మోహన్‌రెడ్డి ససేమిరా అంటున్నారు.

తమ ముఖ్యమంత్రి సామర్థ్యం తెలియక పోలవరం ప్రాజెక్టు అథారిటీ అలా అభిప్రాయపడుతోందని జల వనరుల మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సమర్థించుకునే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉంది. పనులు వేగంగా జరగాలన్న ఉద్దేశంతో టెండర్లు లేకుండా నామినేషన్‌పై ప్రధాన పనులను కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేటాయిస్తుండగా, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం అన్ని పనులు ఆపేసి రీటెండరింగ్‌ పాట పాడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను తిరగదోడటమే లక్ష్యంగా, చివరకు ప్రజలకు ఉపయోగపడే వాటిని కూడా రద్దు చేస్తూ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతోంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే వరకైనా ఆగండి అని జైన్‌ చేసిన సూచనను బేఖాతరు చేస్తూ రీటెండరింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న ఈ వైఖరిని సంబంధిత శాఖ అధికారులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సభ్య సమాజం ఏమనుకుంటున్నదో ముఖ్యమంత్రికి చెప్పే సాహసాన్ని మంత్రులు చేయలేకపోతున్నారు. ‘‘గతంలో దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా 50 శాతం ఓట్లు లభించలేదు. ఆ విధంగా చూస్తే మా వాడు రికార్డు సృష్టించాడు. అయితే కేవలం రెండు నెలలకే అప్రతిష్ఠను మూటగట్టుకున్న ఘనత కూడా మా వాడికే దక్కుతుంది’’ అని కడప జిల్లాకు చెందిన ఒక రెడ్డిగారు ఆవేదన వ్యక్తంచేశారు.175 సీట్లకు 151 సీట్లను ఒకే పార్టీకి కట్టబెడితే పరిస్థితి ఇలాగే ఉంటుందని జగన్‌కు సన్నిహితంగా మెలిగే ఒక కాంగ్రెస్‌ ముఖ్యుడు వ్యాఖ్యానించారు. మొండివాడు రాజు కంటే బలవంతుడు అని అంటారు. ఇక్కడ రాజు కూడా అయిన జగన్‌ మొండితనం ప్రదర్శించడం వల్ల భవిష్యత్తు పరిణామాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆక్షేపణ తెలుపుతూ జపాన్‌ రాయబారి తాజాగా అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు ఘాటైన పదజాలంతో లేఖ రాశారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన తమ దేశానికి చెందిన కంపెనీల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినేలా స్థానిక ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే, అభివృద్ధి చెందిన దేశాల అధినేతలు ఇలాగే స్పందిస్తుంటారు. అదే మన దేశానికి చెందిన కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయినా మన ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవు. ప్రైవేట్‌ కంపెనీల తరఫున లేఖలు రాస్తే ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేస్తాయన్న భయం ఉంటుంది. విదేశీ సంస్కృతికి, మన సంస్కృతికి ఇదే తేడా! ‘‘నేను నవరత్నాలు అమలు చేస్తాను.. నాకు ఇంకేమీ వద్దు. ప్రజలకు కూడా ఇంకేమీ అవసరం లేదు’’ అన్నట్టుగా జగన్మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఫలితంగా పెట్టుబడులకు ఎంపిక చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలన్న అభిప్రాయానికి విదేశాలు వస్తున్నాయి. రాష్ట్ర హితవు దృష్ట్యా ఈ పరిణామాలు ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ఆర్థిక వ్యవస్థ పట్ల అవగాహన ఉన్నవారు ఎవరూ కూడా జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించరు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలలో అవినీతి కనబడుతోందని ముఖ్యమంత్రి జగన్‌ తాజాగా వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై ఆయనకు ఉన్న కోపం రాష్ట్రానికి శాపంగా మారుతున్నది. ఈ విషయంలో మేధావులు మౌనాన్ని వీడాల్సిన సమయం ఆసన్నమైంది. చివరకు అన్న క్యాంటీన్లలో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించే స్థాయికి మంత్రులు చేరుకున్నారు. అన్న క్యాంటీన్లకు ఆహారాన్ని సరఫరా చేసే బాధ్యతను స్వీకరించిన అక్షయ పాత్ర ఒక స్వచ్ఛంద సంస్థ! ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు లంచాలు ఇవ్వడం, పుచ్చుకోవడం చేస్తాయా? అని కూడా ఆలోచించకుండా ఆరోపణలు చేస్తున్నారు.

దీంతో ఏపీలో ఏమి జరుగుతోంది అన్న చర్చ జాతీయ స్థాయిలో నడుస్తోంది. స్వయంగా అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న జగన్మోహన్‌రెడ్డి ప్రతి రోజూ అవినీతి గురించి మాట్లాడటం వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటోంది. ప్రభుత్వం వద్ద నిధులు లేని కారణంగా అవినీతి పేరిట పనులన్నీ నిలిపివేస్తున్నారన్న అభిప్రాయం కూడా క్రమేపీ వ్యాపిస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్‌రెడ్డి ప్రారంభంలో చేసిన వ్యాఖ్యలు ప్రజలను మెప్పించాయి. ‘‘ఆయనలో ఇంత పరివర్తన వచ్చిందా? ఆయన నిజంగా కక్ష సాధింపులకు అతీతంగా, ధర్మబద్ధంగా వ్యవహరిస్తారా? అదే నిజమైతే అంతకంటే కావలసింది ఏముంటుంది?’’ అని ప్రజలు ఉప్పొంగిపోయారు. మూడు నెలలు కూడా గడవక ముందే ప్రజలకు తత్వం బోధపడుతోంది. రాజకీయ కక్ష సాధింపే లక్ష్యంగా జగన్‌ పాలన సాగుతోందన్న అభిప్రాయం కూడా బలపడుతోంది.