గోదావరిలో జగన్ కు ఝలక్… కీలక నేత గుడ్ బై

కాపు రిజర్వేషన్ల విషయంలో పోరాడకుండానే ఓటమిని అంగీకరించిన వైసీపీ అధినేత జగన్ ఆ సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీకి కీలకమైన నేతలను దూరం చేసుకుంటున్నారు. గోదావరి జిల్లాలో కీలకమైన ఒక నేత వైసీపీకి గుడ్ బై చెప్పేసారు. జగన్ తో ఇంకా కొనసాగితే తన రాజకీయ జీవితం ముగిసినట్లే అని నిర్ణయానికి వచ్చిన ఆ నేత వైసిపిని వీడడమే ముఖ్యమనే నిర్ణయానికి వచ్చారు. వెంటనే అమలు చెసేసారు. వైసీపీ అమలాపురం పార్ల మెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు వలవల బాబ్జి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డికి మెయిల్‌ ద్వారా రాజీనామా లేఖ పంపారు.

ఆదివారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పార్టీ నియమించిన రీజనల్‌ కో-ఆర్డినేటర్లను ప్రసన్నం చేసుకునే వారికే పార్టీలో అందలమని వ్యాఖ్యానించారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒకే సామాజికవర్గానికి చెందిన వారిని రీజనల్‌ కో-ఆర్డినేటర్‌లుగా నియమించి ఎదుటి పక్షంపై కులాల కోసం మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చితూరు-విశాఖపట్నానికి విజయసాయిరెడ్డి, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలకు సజ్జల రామకృష్ణారెడ్డి, గుంటూరు, కృష్ణా జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉభయ గోదావరి జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డి, కర్నూలకు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అనంతపురం జిల్లాకు పి.మిథున్‌రెడ్డిలు రీజనల్‌ కో-ఆర్డినేటర్‌లుగా ఉన్నారని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి వల్ల తన లాగా ఇంకా ఎందరో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.

తాడేపల్లిగూడెం నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ తనపై పదే పదే ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో రీజనల్‌ కో-ఆర్డినేటర్‌, జిల్లా సమన్వయకర్త పలుమార్లు సమావేశాలు నిర్వహించినప్పటికీ రాష్ట్ర కార్యదర్శిగా తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. రీజనల్‌ కో-ఆర్డినేటర్‌లు చెప్పిన మాటలే అధినాయకత్వం వింటోందన్నారు. మాజీ ఎంఎల్ఎలు లేదంటే ఎవరైనా పార్టీలోకి వస్తే అప్పటిదాకా ఉన్నవారిని తొలగించడం వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌లో ఆనవాయితీగా మారిందంటూ బాబ్జి తూర్పారబట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలో జగన్‌ పాదయాత్రలో కలిస్తే తాను పార్టీకి నష్టం చేకూరుస్తున్నట్టు నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ చెప్పినట్టు తెలిపారు. ఇటువంటి పరిస్థితిలో జగన్‌ను కలసి ఇక్కడ విషయాలు చెప్పాలని ప్రయత్నించా. గతంలో ఆయన అపాయింట్‌మెంట్‌ ఇట్టే లభించేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితిల్లో పార్టీలో ఉండడమెందుకుని రాజీనామా చేస్తున్నానని బాబ్జి స్పష్టం చేశారు. తాను ఏ పార్టీ లోనూ చేరదలచుకోలేదని వివరించారు.