ఏపీ ప్రత్యేక హోదాపై జగన్ సంచలన వ్యాఖ్యలు..

ఎన్నికలు ముగిసి తొలిసారి మీడియాతో మాట్లాడినపుడే వైసీపీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. ఆ క్రమంలో తొలిసారి ఢిల్లీ వెళ్లి ప్రధానిని తన ప్రమాణస్వీకరానికి ఆహ్వానించిన జగన్ అక్కడ కూడా హోదా అంశం ప్రస్తావనకు తెచ్చారు. ప్రధాని మోదీని కలిసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి చేయాల్సింది చేస్తూనే ఉండాలని రాష్ట్రానికి కాబోయే సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘కేంద్రానికి మన అవసరం లేదు కాబట్టి.. మన వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రయత్నం చేయకపోతే ఎవరూ పట్టించుకోరు.

ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే సమస్య కాదు.. ఆర్థిక సమస్యలు కూడా చాలా ఉన్నాయి. బీజేపీకి 250 సీట్లు మాత్రమే వచ్చి ఉంటే.. ప్రత్యేక హోదాపై సంతకం పెడితేనే మనం మద్దతిచ్చే వాళ్లం. ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టే.. కేంద్రానికి మన బాధ చెప్పుకుంటున్నాం. ప్రధాని మోదీని వదలను.. రోజూ అడుగుతూనే ఉంటాను. మన సహాయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం సాగుతోంది. మన సహాయం వారికి అవసరం లేదు కానీ.. మనల్ని ఆదుకోవాల్సిన అవసరం వారికి ఉంది. రాష్ట్రాన్ని బాగా నడపాలన్న తపన ఉంది కాబట్టే… ఆదుకోవాలని మోదీని కోరా. ప్రత్యేక హోదా విషయం కలిసిన ప్రతి సారి అడుగుతూనే ఉంటా.దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తాం. ఒకేసారి నిషేధిస్తే ఆదాయం దెబ్బతింటుంది. 2024 నాటికి మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌కే పరిమితం చేస్తాం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేస్తాం. నా విశ్వసనీయత చూసే జనం ఓట్లు వేశారు.. ఆ విశ్వసనీయతను నిలబెట్టుకుంటా’’ అని జగన్ తెలిపారు. ప్రధాని మోడీతో ఏపీకి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. భేటీ సందర్భంగా జగన్‌ను ఆలింగనం చేసుకుని భుజం తట్టి మోదీ అభినందించారు.

గంటకు పైగా వివిధ అంశాలపై మోడీతో జగన్ చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భేటీపై మోదీ ట్వీట్టర్‌లో స్పందించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చ జరిపాం. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చాను’’ అంటూ మోడీ కూడా ట్వీట్ చేశారు.