బీజేపీలోకి టీడీపీ కీలక నేత.. చివరిసారిగా చంద్రబాబుతో ఏం చెప్పాడంటే..?

జిల్లాలో కమలం వికసించేనా.. అంటే నిజమేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీని బలోపేతం చేసే దిశగా కమలనాధులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. ఈ నెల 14న ప్రొద్దుటూరులో జరిగే రాయలసీమ జిల్లాల సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విచ్చేస్తున్న నేపధ్యంలో ఆ రోజు కొందరు బీజేపీలో చేరుతున్నారు. మాజీమంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతున్నానని ప్రకటించినా ఆయన చేరిక మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో బలంగా ఉన్న వైసీపీకి ధీటుగా తమ పార్టీని బలోపేతం చేస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాధరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల్లో ఉన్న ముఖ్య నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని ఇది మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు.

మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఇటీవల హైదరాబాదులో బీజేపీ నేత జేపీ నడ్డాను కలిసినట్లు సమాచారం. ఆ తరువాత బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌షా సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ బీజేపీ అగ్రనేతల నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్‌ రాలేదని సమాచారం. బీజేపీలో చేరడం ఖాయమని ఆదినారాయణరెడ్డే స్వయంగా ప్రకటించడం చర్చనీయాంశమైంది. త్వరలో జమ్మలమడుగు నియోజకవర్గంలో అనుచరులు, అభిమానులతో సమావేశం నిర్వహించి అమిత్‌షా సమక్షంలో ఆది బీజేపీలో చేరేలా నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల ఆంధ్రజ్యోతి ప్రతినిధితో ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలో చేరుతున్నానని క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఏమన్నారంటే.. ‘‘దేశ సేవ, సొంత ప్రాంత అభివృద్ధి కోసం బీజేపీలో చేరుతున్నాను. రాష్ట్రమంత్రిగా పనిచేసినప్పుడు కేంద్రపథకాల నిధులతో జమ్మలమడుగు నియోజవర్గంతోపాటు జిల్లాను అభివృద్ధి చేశాను. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి మాట్లాడింది నిజమే. ఇక టీడీపీలో కొనసాగలేనని చెప్పి వచ్చాను. సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఆలోచన మారడం కొంత బాధించింది. గత ఎన్నికల్లో ఆర్థిక విషయాలన్నీ పార్టీ వారే చూసుకుంటామన్నారు. కడప లోక్‌సభ పరిధిలో టీడీపీ అభ్యర్థుల ఎంపిక సక్రమంగా జరగలేదు. ఎంపిక సరిలేదని ఎంత చెప్పినా అధిష్టానం వినలేదు. ఒక్క పులివెందులలో మాత్రం సాహసం చేశారు. మిగిలినవారెవ్వరూ ఎన్నికల సమయంలో సరిగా డబ్బు ఖర్చు పెట్టలేదు. ఇవన్నీ ప్రధానంగా ఓటమికి కారణాలు. చంద్రబాబును కలిసినప్పుడు నేను బీజేపీలో చేరుతానని చెప్పాను. గతంలో నా కుటుంబం వద్దన్నా చంద్రబాబు మాటకు విలువిచ్చాను. నేను డబ్బు, లెక్క చూసుకుంటాను అన్నారు. ఏం చూసుకున్నాను? కేసులు రాజీ పడమన్నారు. పడ్డాను. ఎంపీగా పోటీ చేయమంటే పోటీ చేశాను. ఎంతో నష్టపోయి ఇబ్బందులు పడ్డాను. త్వరలో అనుచరులతో సమావేశమై తేదీ నిర్ణయించుకుని బీజేపీలో చేరడం ఖాయం’’ అని ఆదినారాయణరెడ్డి చెప్పారు. ఇలా.. ఈయనతో పాటు మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది.

జిల్లాలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల మధ్యే పోరు నడిచింది. ఈ ఎన్నికల్లో జగన్‌ సొంత జిల్లాలో గట్టిపట్టు సాధించి అన్నిస్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. జిల్లాలో 15 శాతం ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులంతా ఓటమి పాలు కాగా బీజేపీ అభ్యర్థులు పోటీ చేసినా కనీసం డిపాజిట్‌ కూడా ద క్కించుకోలేదు. మొదటి నుంచి బీజేపీకి జిల్లాలో అంత పట్టు లేదనే రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో రెండోసారి మోదీ అధికారపగ్గాలు చేపట్టడం, రాష్ట్రంలో ఘోరంగా టీడీపీ ఓటమిపాలు కావడం కమలనాధుల్లో ఆశలు రేకెత్తించాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని బలోపేతం చేసేలా ఆ పార్టీ అగ్రనేతలు దృష్టి పెట్టారు. కొందరు ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమాలు మెల్లమెల్లగా జోరందుకుంటున్నాయి. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఎన్నికల తరువాత టీడీపీని వీడి బీజేపీలో చేరడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆయన బీజేపీలో కీలకనేతగా వ్యవహరిస్తున్నారు. టీడీపీలోని మరికొందరు నేతలు బీజేపీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపధ్యంలో మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. ఇలా కాంగ్రెస్‌, టీడీపీలోని ముఖ్య నేతలు కొందరు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. బీజేపీలోని ఓ కీలక నేత మాట్లాడుతూ జిల్లాలో మరిన్ని వలసలు పెరుగుతాయని త్వరలో ప్రధాన పార్టీలోని ముఖ్య నేతలు బీజేపీలో చేరుతున్నారని వెల్లడించారు.ఈ నెల 14న ప్రొద్దుటూరులో రాయలసీమ జిల్లాల సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలంతా హాజరవుతున్నారు. ఈ సదస్సు ప్రధాన అజెండా పార్టీ బలోపేతమే అని నేతలు పేర్కొంటున్నారు. పార్టీ సభ్యత్వం కూడా కమలనాధులు చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో కడప మాజీ డిప్యూటీ మేయర్‌ ఆరిఫుల్లాతో పాటు మరికొందరు మాజీ కార్పొరేటర్లు బీజేపీలో చేరుతున్నారు. మొదట్లో వైసీపీ కార్పొరేటరుగా గెలుపొందిన ఆరిఫుల్లా ఆ తరువాత టీడీపీలో చేరి పూర్తి కాలం డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన టీడీపీ నుంచి బీజేపీలోకి వెళుతున్నారని సమాచారం. ప్రొద్దుటూరులో కాంగ్రెస్‌ నేతగా వ్యవహరించిన వరదరాజులురెడ్డి ఆ పార్టని వీడి టీడీపీలో చేరగా, ఆ తరువాత న్యాయవాది గొర్రె శ్రీనివాసులు కాంగ్రెస్‌ బాధ్యతలు చూస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో ప్రొద్దుటూరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా గొర్రె శ్రీనివాసులు పోటీ చేశారు. ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా సమక్షంలో బీజేపీ కండువా వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన నేతలను ఆకర్షించేందుకు బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. జిల్లాలో పార్టీని బలోపేతం చేసే విధంగా ఆ పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు.

జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు గట్టి చర్యలే తీసుకుంటున్నాం, ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తాం. ఈ నెల 14న ప్రొద్టుటూరులో జరిగే సదస్సుకు రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు నేతలు బీజేపీలో చేరుతున్నారు. ఆరిఫుల్లా, గొర్రె శ్రీనివాసులుతో పాటు కొందరు మాజీ కార్పొరేటర్లు పార్టీలో చేరుతారు. మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి అమిత్‌షా సమక్షంలో చేరుతారని తెలిసింది. మరికొద్దిరోజుల్లో బీజేపీ జిల్లాలో ఎంతో బలపడుతుందని విశ్వసిస్తున్నాం.

"
"