వాలంటీర్ల విషయంలో గంధరగోళం.. క్యూ కడుతున్న విద్యావంతులు

వలంటీర్ల నియామకం కోసం ఒకపక్క ఇంటర్వ్యూలు జరిగిపోతున్నాయి. కానీ మునిసిపాలిటీల్లో ఎంతమంది వలంటరీర్లు అవసరమనే అనుమానాలు వ్యక్తం కావడంతో మళ్లీ సర్వే మొదలు పెట్టారు. ఇంటర్వ్యూలు కొనసాగిస్తూ సర్వే చేస్తున్నారు. ప్రభుత్వం నవరత్నాల పథకాలు అమలు చేయడం కోసం గ్రామ, నగర వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందు అధికారులు 50 నుంచి 100 కుటుంబాలకు ఒక వలంటీరు అని అంచనా వేసి, తమ వద్ద ఉన్న లెక్కల ప్రకారం జిల్లాలోని మునిసిపాలిటీల్లో మొత్తం 5223 మంది అవసరమని గుర్తించారు.

దీని ప్రకారం దరఖాస్తులు ఆహ్వానించి, ఇంటర్య్వూలు కూడా మొదలెట్టారు. ఈ లెక్కలన్నీ 2011 జనాభా ప్రకారం సేకరించిన కుటుంబాల సంఖ్యకు 10.98 శాతం కలిపి అంచనా వేశారు. దీని ప్రకారం జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ మునిసిపల్‌ కార్పొరేషన్లు సహా ఏడు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో మొత్తం వార్డులు 364 వార్డులు ఉన్నాయి. కార్పొరేషన్లలో వీటిని డివిజన్లు అంటారు. మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డులు అంటారు. వీటిలో మొత్తం 2011 జనాభా లెక్కల ప్రకారం 3,04,647 హౌస్‌హోల్డ్‌ సర్వీసులు ఉన్నాయి.కానీ 2011 తర్వాత ఇప్పటివరకూ 10.98 శాతం వృద్ధి ఉంటుందనే అంచనాతో వేసిన లెక్కల ప్రకారం 33,386 ఉన్నాయి. మొత్తం కుటుంబాల సంఖ్య 3,38,032 కుటుంబాలు ఉన్నాయి. వీటి ఆధారంగా 50 నుంచి 100 కుటుంబాలనీ ఒక యూనిట్‌గా విభజించారు. అందువల్ల జిల్లా 5223 యూనిట్టు ఉన్నట్టు గుర్తించారు. వీటికి ఒక్క వార్డు వలంటీరు వంతున మొత్తం 5223 మంది వలంటీర్లు అవసరమని గుర్తించారు.

కానీ ఇటీవల నగరాలు, పట్టణాల్లో కుటుంబాల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ఇంటింటీ సర్వే చేసి లెక్క తేల్చాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపఽథ్యంలో సర్వే మొదలైంది. సర్వే కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంటే, వలంటీర్లసంఖ్య పెరిగే అవకాశం ఉంది. కుటుంబాల సంఖ్య తగ్గితే వలంటీర్ల సంఖ్య తగ్గుతుది. ఒకే చోట ఉన్న అపార్ట్‌మెంట్ల వద్ద వలంటీర్లకు ఎక్కువ కుటుంబాలు కేటాయించే అవకాశం ఉంది.