వైసీపీలో గ్రూపులు క‌డుతోన్న ఎమ్మెల్యేలు… ఏం జ‌రుగుతోంది…!

జ‌గ‌న్ నేతృత్వంలో 151 మంది ఎమ్మెల్యేల‌తో ఏపీలో ప్ర‌భుత్వం ఏర్ప‌డి 6 నెల‌లైంది. 22 మంది ఎంపీలు గెలిచి పార్ల‌మెంటులో ప్ర‌త్యేక హోదా కోసం మాట మాత్రంగానైనా పెద‌వి విప్ప‌కుండా క‌ట్టుదిట్టంగా ఉంచారు వైకాపా అధినేత‌లు. కానీ క‌ట్టువీడిపోతోంది. వైకాపాలో అన్నీ తానై న‌డిపిస్తున్న విజ‌య‌సాయిరెడ్ది అనుమ‌తి లేనిదే ఢిల్లీలో ఎవ‌రినీ క‌ల‌వొద్ద‌ని జ‌గన్ వార్నింగ్ ఇచ్చిన మ‌ర్నాడే..న‌ర్సాపురం ఎంపీ క‌ను రాజు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనువాసులురెడ్డి ప్ర‌ధాని మంత్రి కార్యాల‌యంలో క‌నిపించి సంద‌డి చేశారు. వీళ్ల‌కి షోకాజ్ నోటీసు ఇవ్వ‌డం కానీ, క‌నీసం వివ‌ర‌ణ కోరే సాహ‌సం కూడా వైకాపా చేయ‌లేక‌పోయింది.

వైకాపా బీజేపీ అంటే ఎందుకు భ‌య‌ప‌డుతోంద‌నే ప‌క్క‌న‌బెడితే..హెచ్చ‌రించినా లెక్క‌చేయ‌ని ఈ ఇద్ద‌రు ఎంపీల వెనుక ఎంత మంది ఉన్నార‌నేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే 151 మంది ఎమ్మెల్యేల‌లో స‌గానికి పైగా తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నార‌ట‌. ఇది సాక్షాత్తు ఆ ఎమ్మెల్యేలే త‌మ స‌న్నిహితులు వ‌ద్ద చెప్పిన స‌మాచారం బ‌య‌ట‌కొచ్చి క‌ల‌క‌లం రేపుతోంది. ఒక‌ప్ప‌టి తెలుగుదేశం కంచుకోట అయిన శ్రీకాకుళం నుంచి 8 మంది వైకాపా ఎమ్మెల్యేలు గెలిచారు.వీరిలో ఒక మంత్రి, ఇంకో యువ ఎమ్మెల్యే త‌ప్పించి మిగిలిన వారంతా ఏ ప‌నీ అవ్వ‌డంలేదు, అంతా విజ‌య‌సాయిరెడ్డి ద‌య‌గా మారిపోయింద‌ని తీవ్ర ఆవేద‌న‌లో ఉన్నార‌ట‌. ఇక మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అయితే త‌నను ఎంత మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తీవ్ర ఆవేద‌న‌తో ఉన్న‌ట్టు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక మ‌రో సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్ని జిల్లాల్లోనూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌వ‌ర్గంగా కొంత‌మంది ఎమ్మెల్యేల‌ను కాపాడుకుంటూ వ‌స్తున్నారు.బొత్స వెంట 10మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లోనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అలాగే మ‌రో సీనియ‌ర్ మంత్రి పెద్దిరెడ్డి, ఆయ‌న త‌న‌యుడు క‌నుస‌న్న‌ల్లోనే సీమ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నార‌ని తెలుస్తోంది. పెద్దిరెడ్డి వ‌ర్గంలోనే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు. ఏదేమైనా జ‌గ‌న్ ప్ర‌యార్టీ ఇవ్వ‌డం లేద‌నో.. లేదా ప‌నులు కావ‌డం లేద‌నో లాంటి కార‌ణాల‌తో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎవ‌రికి వారు గ్రూపులు క‌ట్టేస్తున్నారు. మ‌రి ఇది భ‌విష్య‌త్తులో ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుందో ? చూడాలి.