గాజువాకలో పవన్ ని ముంచింది ఏమిటో తెలుసా… ఆ పార్టీ సమీక్షలో దిమ్మతిరిగే వాస్తవాలు

మార్పు కోసం రాజకీయాలు మొదలుపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన తొలి యుద్ధంలోనే చతికిల పడ్డారు. ఆయన పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్క సీటుతో సరిపెట్టుకోగా స్వయంగా పవన్ కూడా రెండు చోట్లా ఓడిపోవడం జనసేన శ్రేణులను నివ్వెరపరించింది. అయితే గాజువాకలో గెలుస్తామని ధీమాగా ఉన్న పవన్ కల్యాన్ కి ఆ అతి ధీమాయే నష్టం చేసిందని తెలిపోయింది. మితిమీరిన విశ్వాసం, నాయకత్వలోపం గాజువాక నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఓటమికి కారణమయ్యాయి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు…అటువంటిది ఓటర్లను కలవకుండా, ఓటేయాల్సిందిగా అడగకుండా కేవలం తన ఫొటో చూసి ఓటేస్తారని భావించిన పవన్‌కు గాజువాక ఓటర్లు షాక్‌ ఇచ్చారు.

కర్ణుడి చావుకు కోటి కారణాలు అన్నట్టు పవన్‌ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయన కచ్చితంగా విజయం సాధించేందుకు అవకాశం వున్న నియోజకవర్గం గాజువాక. ఆయన ఏర్పాటు చేసుకున్న కమిటీ కూడా అదే నిర్ధారించింది. అయితే ప్రచార, నాయకత్వ లోపం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించడంతో ఆయన ప్రత్యర్థులపై విజయం సాధించలేకపోయారు. నామినేషన్‌ దాఖలు చేసినప్పుడు కనిపించిన ఉత్సాహం ఆ తర్వాత కనుమరుగైంది అన్ని పార్టీలు విస్తృత ప్రచారం చేస్తున్నా జనసేన స్తబ్దుగా కనిపించింది. నియోజకవర్గంలో విజయం కోసం రెండేళ్లుగా గ్రౌండ్‌ వర్కు చేసుకుంటూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యను ఆఖరి నిమిషంలో పెందుర్తి నియోజకవర్గాన్ని కేటాయించారు.దీంతో ఇక్కడ క్యాడర్‌ను నడిపించే నాయకులు కరువయ్యారు. మరో సీనియర్‌ నాయకుడు కోన తాతారావుకు తూర్పు నియోజకవర్గాన్ని కేటాయించారు. ఆయనకున్న ఫాలోయింగ్‌ మాట ఎలా వున్నా చాలా ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉంది. దానిని పార్టీ సక్రమంగా వినియోగించుకోలేకపోయింది. నామినేషన్‌ వేసిన తర్వాత పవన్‌ తరపున ప్రచారం చేసే నాయకుడు కానరాలేదు. అభిమానులు సొంత ఖర్చులతో వీధివీధికి తిరిగే ప్రయత్నం చేశారు. పార్టీ మ్యానిఫెస్టో, నియోజకవర్గ మ్యానిఫెస్టో ప్రజల్లోకి వెళ్లలేదు. పవన్‌కల్యాణ్‌ స్థానికేతరుడు అన్న ప్రతిపక్షాల ప్రచారాన్ని జనసేన నేతలు తిప్పికొట్టలేకపోయారు.గాజువాక, భీమవరం…రెండుచోట్ల పవన్‌కల్యాణ్‌ గెలిస్తే గాజువాకలో రాజీనామా చేస్తాడని ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేశాయి. టీడీపీతో పవన్‌ కుమ్మక్కయ్యారన్న ప్రచారాన్ని వైసీపీ జోరుగా ప్రచారం చేసింది. ఆఖరి రెండు రోజులు పవన్‌ విస్తృతంగా పర్యటిస్తే విజయం ఖాయమని భావించినా అదీ చేయలేకపోయారు. గాజువాకలో మొత్తంగా మూడు సార్లు మాత్రమే సభలు నిర్వహించారు. అందులో ఒకటి రోడ్‌షో. చివరకు నియోజకవర్గంలో ఉన్న 307 పోలింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లను కూడా నియమించుకోలేకపోయారు. ల్ రాజకీయ అనుభవం ఉన్న నేతలెవరూ ఈ నియోజకవర్గంలో పవన్‌ కోసం కార్యాచరణ రూపొందించలేదు. కులబలం, అభిమానులు పుష్కలంగా ఉన్నా వారిని తమవైపునకు తిప్పుకోవడంలో విఫలమయ్యారు.

టీడీపీ, వైసీపీ గడపగడపకూ వెళ్లి ప్రచారం చేస్తే పవన్‌ తరపున అభిమానులు తగిన నాయకత్వం, వ్యూహం లేక ఆ పని చేయలేకపోయారు. ఎక్కడి నుంచో వచ్చిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారులకు పవన్‌ గెలుపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా నాయకులు పవన్‌ విజయంలో కీలకపాత్ర పోషించలేకపోయారు. పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు కనీస గుర్తింపు లేకుండా చేశారు. అభిమాన సంఘాలను, కాలనీ అసోసియేషన్లను, కుల సంఘాలను కలుపుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. గత ఎన్నికలకు ముందే పార్టీ పుట్టినా వార్డు స్థాయి నాయకులను ఈ ఎన్నికలకు వారం ముందు వరకు నియమించుకోలేకపోయారు. ఒక రకంగా జేడీ ఈ నియోజకవర్గంలో చురుకైన పాత్ర పోషించారు. పవన్‌ కల్యాణ్‌కు వున్న క్రేజ్‌ కారణంగా అన్ని వేల ఓట్లు పడ్డాయి. లేకుంటే జనసేన పోల్‌ మేనేజ్‌మెంటుకు మరొకరు అభ్యర్థి అయితే డిపాజిట్లు కూడా దక్కేవి కావు.