ఇసుక రేటు చూస్తే గుబేల్.. అందుబాటులో ఉన్నా రేటు ఆకాశానికి

ఏపీలో ఇసుక మళ్ళి దోరుకుతుంది. మోన్నటి వరకూ ఇసుక లేక విలవిల్లాడిన భవన కార్మీకులు ఆనందపడ్డారు. ఇక ఇసుక దోరుకుతుంది అనే వార్త నిర్మాణ రంగంలో వున్న ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేశారు. కాని ఇలా ఆనందపడే లో పే వైసీపీ  ప్రభుత్వం ఇసుక తీసుకునే వారికి షాక్ ఇచ్చింది.ఒకప్పుడు అసలు దొరకని ఇసుక క్రమంగా దొరుకుతోంది. లభ్యత పెరిగింది. ఇసుక వారోత్సవాల పేరుతో ఎక్కడికక్కడ లభ్యత పెంచే అంశంపై ప్రభుత్వం దృష్టిపెట్టడంతో కొంతమేర ఫలితాలు వస్తున్నాయి. అయితే ధర మా త్రం ఇంకా దిగిరావాల్సే ఉంది. ఇప్పటికీ నగరాల్లో చి న్న లారీ ధర రూ.10వేలు పలుకుతోంది. అధికారికంగా బుక్‌ చేసినా, అనధికారికంగా తెచ్చినా ఇదే ధర పడుతోంది. ఇంకొన్ని రోజులు ఆగితే ధర కాస్త దిగి వస్తుందేమో అన్న ఉద్దేశంతో కొందరు పనులు వాయిదా వేసుకుంటున్నారు. గతంలో రవాణా చార్జీలతో కలిసి 10-12టన్నుల ఇసుక లారీ రవాణా చార్జీలు, లోడింగ్‌ ఖర్చుతో కలిసి రూ.3,500లకు దొరికేది. విజయవాడ, గుంటూరుల్లో అప్పట్లో ధర ఇది! ఇప్పుడు ప్రభుత్వమే ఉచితం తీసేసి ధర పెట్టింది కాబట్టి.. మరో రూ. 3,000 ధర పెరగాలి. అంటే రూ.6,500లకు అదే లారీ ఇసుక లభించాలి.

అయితే ఇప్పుడు ఇది రూ.10వేల వరకు అవుతుంది. నెల క్రితం వరకు ఈ ధర రూ.15 వేలకు చేరింది. ఇటీవల కాలంలో క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయినా గతంతో పోలిస్తే మూడింతలు పెరిగింది. దీంతో ఈ ధర మరింత తగ్గితే కొనుగోలు చేద్దామన్న ఉద్దేశంతో పలువురు ఎదురుచూస్తున్నారు.ఇసుక విధానంలో భాగంగా రీచ్‌లు, స్టాక్‌యార్డులు అని రెండుభాగాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రీచ్‌లలో టన్ను ఇసుక ధర రూ.375గా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లోని రీచ్‌లకు దగ్గరగా ఉన్న స్టాకుయార్డుల్లో సుమారుగా ఇదే ధర నడుస్తోంది. అయితే కొన్నిచోట్ల మాత్రం ఈ ధర రెట్టింపు కంటే ఎక్కువుంది. రీచ్‌లు, స్టాక్‌యార్డులను వేరు చేయడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. రీచ్‌లో ఒకసారి లోడ్‌ చేసి, దాన్ని స్టాక్‌పాయింట్‌లో అన్‌లోడ్‌ చేస్తున్నారు. స్టాక్‌పాయింట్‌లో వినియోగదారుల వాహనాల్లోకి మళ్లీ ఒకసారి లోడ్‌ చేయాల్సి వస్తోంది. అంటే రెండోసారి లోడింగ్‌ ఖర్చు పడుతోంది. దీంతో పలు పాయింట్లలో అధికారికంగానే టన్ను ధర అధికంగా ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన రూ.375ధర కాకుండా…రూ.825 కట్టాల్సి వస్తోంది.

విజయవాడలోని భవానీపురం, షాదీఖానా, కానూరుల్లోని స్టాక్‌పాయింట్లలో ఇదే పరిస్థితి! అవనిగడ్డ స్టాక్‌పాయింట్‌లో రూ.625, నూజివీడు స్టాక్‌యార్డులో రూ.725ధర అధికారికంగానే పెట్టారు. అలాకాకుండా నేరుగా రీచ్‌లలోనే వినియోగదారులకు లోడింగ్‌ చేస్తే ఆ ఖర్చు తగ్గుతుందని పలువురు గృహ నిర్మాణదారులు అభిప్రాయపడుతున్నారు.కొన్ని రీచ్‌లలో ఇప్పటికీ రాత్రిపూట అక్రమంగా ఇసుక రవాణా అవుతోంది. అధికారికంగా ఒక రశీదు కట్టి..అదే రశీదుతో రాత్రిపూట మరో లోడ్‌ అక్రమంగా వేసుకుంటున్నారని సమాచారం. అయితే ఈ అక్రమ లోడ్‌కు అనధికారికంగా మాత్రం అధికారిక ధర చెల్లించేస్తున్నారు. డబ్బులిచ్చి అక్రమంగా ఇసుక తీసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించినప్పుడు..కొంతమంది వాహనదారులు రోజుకు రెండు ట్రిప్పులు వేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ పనికి పాల్పడుతున్నారు. వాహనం పగలు ఒక లోడ్‌, రాత్రి ఒక లోడ్‌ వేసుకుంటే కాస్త గిట్టుబాటు అవుతుందన్న వారి ఉద్దేశ్యాన్ని స్థానిక రీచ్‌లపై పెత్తనం చేస్తున్నవారు క్యాష్‌ చేసుకుంటున్నారు.అటువంటివారి నుంచి అనధికారికంగా డబ్బు తీసుకుని లోడింగ్‌ చేసి పంపించేస్తున్నారని తెలిసింది.

అయితే లోడింగ్‌ చేయడం వరకే తమ బాధ్యత అని, ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటే తమకు సంబంధం లేదని కూడా చెప్తున్నారని సమాచారం. అయినా రాత్రిపూట తోలకాలు కొన్నిచోట్ల జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని రీచ్‌ల నుంచి రాత్రిళ్లు పెద్ద లారీలు పట్టణాలు, నగరాలకు అక్రమంగా రవాణా చేస్తున్న వ్యవహారాలూ కొంతమేర జరుగుతూనే ఉన్నాయని అంటున్నారు. సరఫరా విషయంలో తీసుకున్న చొరవను ధర తగ్గించే విషయంలోను ప్రభుత్వం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.