ఓడినా.. మొక్క‌వోని ధైర్యం.. దేవినేని అవినాష్ ఇన్స్‌పిరేష‌న్ స్పీచ్‌

తాజాగా జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లో అధికార టీడీపిని ప్ర‌జ‌లు తిప్పికొట్టారు. త‌మ‌కు చంద్ర‌బాబు పాల‌న అవ‌స‌రం లేద‌ని తీర్పు చెప్పారు. అంతేకాదు, ఎన్నాళ్లో వేచిన ఉద‌యాన్ని.. అందిస్తూ.. జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ క్ర‌మంలో టీడీపీలో తొలిసారి పోటీ చేసి ఓడిపోయిన వారు, వ‌రుస విజ‌యాలు సాధిస్తూ.. త‌మ‌కు తామే బ్రేకులు వేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే, వీరిలో ప్ర‌ధానంగా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది గుడివాడ నుంచి పోటీ చేసిన దేవినేని నెహ్రూ పుత్ర‌ర‌త్నం, యువ నాయ‌కులు, తెలుగు యువ‌త రాష్ట్ర అధ్య‌క్షుడు దేవినేని అవినాష్‌.

రాజ‌కీయ దిగ్గ‌జం, వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న గుడివాడ ఎమ్మెల్యే వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నానిపై పోటీ చేశారు.టీడీపీ, చంద్ర‌బాబునాయుడుల‌పై ఒంటెత్తు పోక‌డలు పోయిన కొడాలి నానికి ఎట్టిప‌రిస్థితిలోనూ చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యిం చుకున్న చంద్ర‌బాబు.. ఆదిశ‌గా వేసిన అడుగుల్లో ఇక్క‌డ దేవినేని అవినాష్‌కు అవ‌కాశం ఇచ్చారు. నామినేష‌న్ నుంచి కూడా ఎన్నిక‌లు ముగిసేవ ర‌కు కూడా అవినాష్ చాలా క‌ష్ట‌పడ్డారు. ప్ర‌తి ఒక్క‌రినీ ప‌ల‌క‌రించారు. ప్ర‌తి విష‌యంలోనూ ఆచి తూచి వ్య‌వ‌హ‌రించారు. ఇంటింటికీ తిరిగి త‌న‌ను గెలిపించాల‌ని కోరారు. అయితే, జ‌గ‌న్ మ్యానియాలో ఆయ‌న కూడా ప‌రాజ‌యం పాల‌య్యారు. దీంతో గుడివాడ టీడీపీలో నిస్తేజం అలుముకుంది. అయితే, ప‌డిలేచిన కెర‌టం మాదిరిగా అవినాష్‌.. త‌న ఓట‌మి తాలూకు ప్ర‌భావాన్ని పంటిబిగువున భ‌రించారు. అదేస‌మ‌యంలో కేడ‌ర్‌లో దైర్యాన్ని నింపేందుకు రెడీ అయ్యారు. ఈక్ర‌మంలోనే తాజాగా ఆయ‌న గుడివాడ నియోజ‌క‌వ ర్గంలో త‌న‌కు స‌హ‌క‌రించిన‌, త‌న వెంట తిరిగిన‌, త‌న కు ప్ర‌చారం చేసిన టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. ఓట‌మి.. అనేది గెలుపున‌కు తొలి మెట్టుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ కుంగిపోవ‌ద్ద‌ని ఆయ‌న ధైర్యం నూరిపోశారు.

త‌న వ‌య‌సు 30 ఏళ్లేన‌ని, మ‌రో 40 ఏళ్ల‌పాటు రాజ‌కీయాల్లో ఉంటాన‌ని ఇప్పుడు కాక‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా విజ‌యాన్ని కైవ‌సం చేసుకుందామ‌ని కార్య‌క‌ర్త‌ల‌కు, నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. ఓట‌మి నుంచి అనేక పాఠాలు నేర్చుకుని గెలుపు దిశ‌గా ప‌య‌నించ‌డ‌మే మ‌న ముందున్న క‌ర్త‌వ్య‌మ‌ని ఆయ‌న చెప్పిన మాట‌లు ఇక్క‌డ కేడ‌ర్‌లో నూత‌న ఉత్తేజాన్ని నింపాయి. మొత్తానికి ఓడిపోయినా కూడా కేడ‌ర్‌ను కాపాడుకోవ‌డంలో భాగంగా ఇన్‌స్పిరేష‌న్ స్పీచ్‌తో అద‌ర‌గొట్టిన అవినాష్‌ను చూసి కేడ‌ర్ ధైర్యంతో ముందుకు సాగేందుకు రెడీ అయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.