ఏపీలో ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్.. పోరు ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది. కాదు కాదు ఎన్నికల కురుక్షేత్రానికి ముందు ట్రైలర్ లాంటి ఎమ్మెల్సీ పోరుకు రంగం సిద్ధమైంది. ఇంకో ఒక్క రోజు తర్వాత ఎమ్యెల్సి ఎన్నికల కోడ్ రానుంది. రాష్ట్రంలో ఇక కొత్త పథకాలు ప్రకటించడానికీ, అభివృద్ధి పథకాలకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడానికీ వీలు లేకుండా పోతుంది. ఈ మేరకు ఎన్నికల కోడ్‌ చెక్‌ పెట్టనుంది. ఈ నెల 14న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌, దాంతోపాటే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. అప్పటి నుంచి రాష్ట్రప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించడానికీ, అభివృద్ధి కార్యక్రమాలకు అప్పటినుంచి శంకుస్థాపన చేసేందుకూ వీలు ఉండదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రాష్ట్రంలో ఏడు జిల్లాలకు వర్తించే అవకాశముంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఈ కోడ్‌ వర్తిస్తుంది.

అంటే మిగతా ఆరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు లేనందున ఆయా జిల్లాలకు వర్తించదు. దాదాపుగా సగం పైగా రాష్ట్రంలో మూడు రోజుల్లో కోడ్‌ అమల్లోకి రానుంది. ఇది దాదాపుగా ఈ నెలాఖరు వరకు ఉంటుంది. ఆ తరువాత వెంటనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది. ఫిబ్రవరి 28 లేక మార్చి 4వ తేదీన ఈ కోడ్‌ రావొచ్చని అంటున్నారు. ఫిబ్రవరి చివరిలోనే వస్తే, ఇక ఇటు ఎమ్మెల్సీల ఎన్నికల కోడ్‌, ఆ వెంటనే సాధారణ ఎన్నికల కోడ్‌ అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. మధ్యలో సమయం ఉండదు. ఒకవేళ మార్చి 4వ తేదీన సాధారణ ఎన్నికల ప్రకటన వస్తే మాత్రం కోడ్‌కు నాలుగైదు రోజుల విరామం మధ్యలో ఉంటుంది. మొన్ననే గుంటూరు వచ్చి వెళ్లిన ప్రధాని నరేంద్రమోడి మార్చి ఒకటోతేదీన విశాఖపట్నం రానున్నారు. కొన్ని పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అంటే అప్పటికి సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ రాకపోవచ్చని అంటున్నారు. మార్చి మొదటి వారంలోనే నోటిఫికేషన్‌ వస్తుందని…అందుకే ప్రధాని మార్చి 1న విశాఖ కార్యక్రమం పెట్టుకున్నారని భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా…ఎన్నికల విధుల్లో భాగస్వాములు అయ్యే అధికారుల బదిలీలు, పోస్టింగులు కూడా ఉండవు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం 103 మంది డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోల బదిలీలు పూర్తిచేసింది. ఇంకోవైపు కోడ్‌ అమల్లో ఉండగా…కొత్తగా సంక్షేమ పథకాలను ప్రభుత్వపరంగా ప్రకటించకూడదు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయకూడదు. కానీ సాధారణ పాలనకు సంబంధించిన అంశాలూ, ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల లబ్ధి అందించడం, ఇప్పటికే ప్రకటించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం లాంటివి చేసేందుకు ఇబ్బంది ఉండదు. రాజకీయ పార్టీలపరంగా ఎన్నికల హామీలు, మేనిఫెస్టోలు ప్రకటించుకోవచ్చు. కానీ ప్రభుత్వపరంగా చేయడానికి వీల్లేదు.