కలిసికట్టుగా కరోనాపై యుద్దం… సక్సెస్ అయిన జనతా కర్ఫ్యూ …

కరోనాను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రజలంతా స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం ఇదే పరిస్థితి కనిపించింది. ఎక్కడా టీ దుకాణాలు, పాన్‌ షాపులు కూడా తెరుచుకోలేదు. ప్రైవేటు వాహనాలు, ఆటోలు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ రోడ్లపైకి వచ్చిన పోలీసులు కర్ఫ్యూ పూర్తిస్థాయిలో విజయవంతమయ్యేలా కృషి చేశారు. పోలవరం ప్రాజెక్టులోని పనులు నిలిపివేసి కార్మికులు కర్ఫ్యూ పాటించారు. ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు జీలుగుమిల్లి వద్ద పెద్దఎత్తున వాహనాలు నిలిపివేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు మెళియాపుట్టి మండలంలో రాకపోకలు నిలిచిపోవడంతో చెన్నై నుంచి ఒడిశాలో పర్లాకిమిడి వచ్చిన అనేకమంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

 

కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రధాన పట్టణాల్లో రోడ్లు బోసిపోయాయి. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట వద్ద, నల్లగొండ, ఖమ్మం సరిహద్దుల వద్ద 52 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. విజయనగరంలో ప్రధాన మార్కెట్‌, వస్త్ర, హోల్‌సేల్‌ మార్కెట్లన్నీ మూతపడ్డాయి. విశాఖలో ఉదయం 6గంటల నుంచే రహ దారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. కరోనా లక్షణాలతో ఎవరైనా వ్యక్తి ఆస్పత్రికి వస్తే.. వారికి ఏ విధమైన పరీక్షలు చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై అవగాహన కోసం కింగ్‌ జార్జి ఆస్పత్రిలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి, చిత్తూరులో జనం స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన ఒంగోలు నగరం, ఇతర పట్టణాలు నిర్మానుష్యమయ్యాయి. కడప, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో కర్ఫ్యూ విజయవంతమైంది. ‘‘మీరు ఇళ్లలో ఉండండి.. మేము బయట ఉంటాం’’ అనే ప్లకార్డులతో నెల్లూరుజిల్లా ఆత్మకూరులో ఆర్డీవో ఉమాదేవి, మున్సిపల్‌ కమిషనర్‌, పోలీసు అధికారులు రోడ్లపై తిరిగారు. గుంటూరు రైల్వే డివిజన్‌లో కొన్ని స్టేషన్లు ఆదివారం ఉదయం నుంచే మూతబడగా అన్ని స్టేషన్లు అర్ధరాత్రి నుంచి మూసేశారు. కాగా, సాయంత్రం 5గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బాల్కనీలు, వరండాల్లోకి వచ్చి హర్షధ్వానాలతో కరోనా కట్టడికి కృషిచేస్తున్న యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఓ వృద్ధురాలి మృతదేహానికి ఆదివారం ఉదయం 6.30గంటలకే అంత్యక్రియలు పూర్తిచ చేసిన ఘటన గుంటూరు ఏటుకూరు రోడ్డులో చోటు చేసుకుంది. ఈ ఘటన ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. గుంటూరు డీఎస్‌ నగర్‌కు చెందిన గుంటుపల్లి సుబ్బమ్మ(95) శనివారం రాత్రి మృతిచెందింది.

 

ఆమె కుమారులు, కుమార్తెలు దూరప్రాంతాల్లో ఉండిపోయారు. వారు వచ్చే అవకాశం లేకపోవడంతో బంధువులు, స్థానికులు ఉదయం 6గంటలకే అంత్యక్రియలు ప్రారంభించారు. 7గంటల కల్లా ఆ కార్యక్రమం పూర్తిచేసి జనతా కర్ఫ్యూలో పాలుపంచుకున్నారు.కరోనా వైర్‌సను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని పొగాకు వేలం కేంద్రాలను ఈనెలాఖరు వరకు మూసివేస్తున్నట్లు ఈడీ కె.సునీత తెలిపారు. పొగాకు కొనుగోళ్లు, వేలం కేంద్రాలు తదితర అంశాలపై వ్యాపారులు, పొగాకు వేలం కేంద్రాల అధ్యక్షులు, అధికారులతో ప్రధాన కార్యాలయం గుంటూరులో సమీక్షించినట్లు తెలిపారు. పొగాకు రైతుల్లో వైరస్‌ నివారణ, రాకముందు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఈడీ వివరించారు.

"
"