కరోనా ఎఫెక్ట్… లాక్ డౌన్ విడితే ఇక అంతే..

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వస్తే కేసులు పెడతామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. ఉదయం వేళల్లో ఒక్కరే వచ్చి నిత్యావసరాలు తీసుకెళ్లేందుకు పోలీసులు కూడా అభ్యంతరం చెప్పడం లేదన్నారు. అయితే రోజంతా రోడ్లపైకి వస్తూ ఇతరుల ఆరోగ్యానికి హాని కలిగించేలా వ్యవహరించడం సబబు కాదన్నారు. ఇప్పటికీ తాము అభ్యర్థిస్తున్నామని, కాదని ఎదురు తిరిగితే బండి సీజ్‌ చేయడమే కాకుండా కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఆయన మంగళవారం పర్యవేక్షించారు.ప్రజలు రోడ్లపైకి వస్తున్న తీరు, ట్రాఫిక్‌ ఇబ్బందులు, వాహనాలపై వచ్చేవారు పోలీసులతో చేస్తున్న వాదనలు, పోలీసులు అదుపు చేస్తున్న విధానం తదితర దృశ్యాలను సీసీ కెమెరాల ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ నుంచి వీక్షించారు.

 

అనంతరం జిల్లాల ఎస్పీలతో పోలీస్‌ బాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌, టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.‘ఉదయం మినహా ఇతర సమయాల్లో ఎవ్వరినీ రోడ్లపైకి రానీవద్దు. అనవసరంగా వచ్చేవారిని వదలొద్దు. ఏదో కారణం చూపి పదేపదే వస్తున్న వారిపై చర్యలు తీసుకోండి’ అని పోలీసులను ఆదేశించారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దన్నారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసి వైద్యసిబ్బందికి అండగా నిలవాలని సూచించారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, రెండు మూడేళ్ల క్రితం వైద్యం చేయించుకున్న ఆస్పత్రి ఫైళ్లు చేతిలో పట్టుకుని వైద్యం పేరుతో తిరుగుతున్నారని చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే అరెస్టులు కూడా తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. విదేశాల నుంచి వచ్చినవారంతా స్వచ్ఛందంగా వైద్య పరీక్షలకు ముందుకు రావాలని డీజీపీ విజ్ఞప్తిచేశారు.ఇలాంటివారు చాలామంది సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారన్నారు. వారితో పాటు కుటుంబ సభ్యులపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని, పాస్‌పోర్టు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. విజయవాడ రామవరప్పాడు రింగ్‌రోడ్డు వద్ద లాక్‌డౌన్‌ పరిస్థితిని ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుబజార్లు ఉదయం 6నుంచి 8గంటల వరకు పనిచేస్తున్నా రద్దీ ఎక్కువగా ఉన్నందున వాటి పనివేళల్లో సడలింపు చేస్తామని తెలిపారు.

 

అంతర్‌ జిల్లా సర్వీసుల బంద్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు సహకరించకుండా రోడ్లపై వాదనకు దిగడం సరికాదని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలకు ఆయన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలాఉండగా, లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినవారిపై రాష్ట్రవ్యాప్తంగా 347కేసులు నమోదు చేసినట్లు డీజీపీ కార్యాలయం పేర్కొంది. 13జిల్లాల్లో 2,700కు పైగా వాహనాలు సీజ్‌ చేసినట్లు తెలిపింది.

"
"