చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి షాకిచ్చిన సొంత తమ్ముడు..?

ఆయన వైసీపీలో కీలక నేత. కాబోయే స్పీకర్ లేదా కీలక మంత్రిగా కూడా ప్రచారంలో ఉంది. వైసీపీలో గత పదేళ్లుగా ఆర్ధిక వనరులు సమకూర్చడంలో ఆయనే కీలక భూమిక పోషించారని ప్రచారంలో ఉంది. జగన్ పాదయాత్ర ప్రకటించగానే అందుకు అయ్యే వ్యయం మొత్తం తానే భరిస్తానని ముందుకు వచ్చిన నేత ఆయన. అయినా జగన్ మాత్రం పాదయాత్ర ఖర్చు పార్టీయే భరిస్తుందని చెప్పడంతో ఆయనపై భారం పడలేదు.

అయినప్పటికి రాజకీయాల్లో దురందరుడు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయినా ఆ ఆనందం సొంత తమ్ముడి ఆయనకు మిగల్చలేదు. ఎందుకంటే… చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఎన్నికయ్యారు. పీలేరు, పుంగనూరు ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికై మెజారిటీ చేజిక్కించుకోవడంలో ఆరితేరిన రాజకీయ ఉద్దండుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.తంబళ్లపల్లెలో వైసీపీకి సరైన లీడర్‌ అందుబాటులో లేకపోవడంతో తన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని వైసీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. సుమారు రెండేళ్ల నుంచి ద్వారకనాథరెడ్డి గ్రామ, గ్రామాన తిరుగుతూ అక్కడి ప్రజలు, చోటా నాయకులతో పరిచయాలు పెంచుకున్నారు. అంతేకాకుండా శుభకార్యాలు, చావులు, ఏ చిన్న కార్యక్రమాలకు పిలుపు వచ్చినా, రాకున్నా తంబళ్లపల్లె నియోజకవర్గంలో వాలిపోయే వారు. దీంతో పాటు రామచంద్రారెడ్డి తమ్ముడిగా, పాతకాపులతో దోస్తీ పెంచుకున్నారు.ఇదే ఒరవడిలో ప్రచారాలు నిర్వహించి, తన అన్నతో భాగస్వామ్యం పంచుకున్నారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక తన తమ్ముడికి వచ్చిన మెజారిటీ చూసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆనందంతో కూడిన ఆశ్చర్యానికి గురై వుండొచ్చు. పుంగనూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 43,555 ఓట్ల మెజారిటితో (54.85శాతం ఓట్లు) వచ్చింది. అలాగే తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికైన పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డికి 46,938 ఓట్ల మెజారిటీ (59.41శాతంఓట్లు) వచ్చాయి.

అంతేకాకుండా జిల్లాలోని 14 మంది ఎన్నికైన ఎమ్మెల్యేలలో తొలిసారి పోటీలోనే అందరిని వెనక్కి నెట్టి మెజారిటీలో అగ్రస్థానంలో నిలిచారు. అన్న కంటే ఎక్కువ మెజారిటీ వచ్చిన ద్వారకనాథరెడ్డి ఎన్నికల ఫలితాల సందర్భంగా మీడియా ఆయనను పలకరిస్తే.. మాట్లాడుతూ ఎంత మెజారిటీ వచ్చినా అది తన అన్న చలువే అని, తాను అన్న చాటు తమ్ముడే అని స్పష్టం చేశారు. తమ్ముడికి వచ్చిన మెజారిటీ చూసి పెద్దిరెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ద్వారకనాథరెడ్డి కూడా అన్నను మించిన తమ్ముడు అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.