చింతమనేని పై భారీ కుట్ర … జగన్ ఇంతలా ప్లాన్ చేస్తున్నాడా…?

టీడీపీ లో అందరూ లీడర్లు ఒకలాగా ఉంటే ఈయన మాత్రం అందరికి భిన్నంగా ఉంటాడు…. ఆయన రూటే సెపరేటు. అలాంటి శైలితో బాగా పాపులర్‌ అయ్యారు తెలుగుదేశం నాయకుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌. ఆయన తీరు ఏక్కడ మారదు. అది అధికారపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. దురుసు వ్యాఖ్యలు చేస్తారు. సహనం కోల్పోతే ఎదురుగా ఉన్న వ్యక్తులు ఎంత పెద్దవారయినా చేయి చేసుకోవడానికి వెనుకాడరు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన నడవడికలో ఏ మాత్రం మార్పులేదు.అధికారంలో ఉన్నప్పుడు కొందరు నేతలు అతి దూకుడు ప్రదర్శిస్తారు. తమకి తిరుగులేదని విర్రవీగుతారు. ఆ సమయంలో వారి చుట్టూ ఉన్నవారు వంగి వంగి దండాలు పెడతారు. అదే వారు అధికారానికి దూరమయ్యారనుకోండి- సీన్‌ మారిపోతుంది. అప్పటివరకూ ఆ తరహా నేతలకి ఎదురు మాట్లాడటానికి జంకినవారు కూడా “పీడా విరగడయ్యింది” అని మెటికలు విరుస్తారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిస్థితి ఇలాగే తయారయ్యింది. మొన్నటి ఎన్నికల్లో చింతమనేని పరాజయం పాలవడంతో ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు చేయని ప్రయత్నం లేదు. చివరకు ఏమైందో తెలియాలంటే చూడాల్సిందే!

2009లో దెందులూరు ఎమ్మెల్యేగా మొదటిసారి చింతమనేని ఎన్నికయినప్పుడు, రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అయినా చింతమనేని దూకుడు తగ్గలేదు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో అందరికంటే ఒక అడుగు ముందున్నారు. దెందులూరులో జరిగిన ఒక కార్యక్రమంలో అయితే, అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్ మీదే కలబడినంత పనిచేశారు. ఆ సంఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తర్వాత కాలంలో టీడీపీ అధికారంలోకి రావడం.. సార్‌వాడు కూడా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో.. ఇక ఆయనకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అధికారదాహాన్ని తీర్చుకోవడానికి చింతమనేని చేయని పనులంటూ లేవనే చెప్పాలి. అధికారులపైనా, గిట్టనివారిపైనా దాడులు చేయడం, వారిపై నోరు పారేసుకోవడం వంటి ఘటనలు షరా మామూలయ్యాయి. సంపాదన కోసం చింతమనేని తొక్కని అడ్డదారులంటూ లేవని రాజకీయవర్గాల్లో జోరుగానే ప్రచారం సాగిందనుకోండి. అటువంటి చింతమనేని ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీనికితోడు తెలుగుదేశం పార్టీ కూడా అధికారానికి దూరమైంది. అదిగో.. అప్పటినుంచి అయ్యగారికి చుక్కలు కనిపించడం మొదలయ్యింది. ఎన్ని రకాలుగా ఆయనను తొక్కాలో అన్ని రకాలుగా అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఆయనను తొక్కడానికి ప్రయత్నాలు షురూ చేసింది. ఇదంతా ఒక ఎత్తయితే, చింతమనేనిని అరెస్ట్ చేయడానికి జరిగిన ప్రయత్నాలు మరో ఎత్తుగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

రెండుసార్లు దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చింతమనేని ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలోనే నడిపారు. మౌలిక సదుపాయాల దగ్గర నుంచి సంక్షేమ కార్యక్రమాల అమలు వరకు.. అన్నిటా ఆ నియోజకవర్గం ప్రథమస్థానంలోనే నిలిచింది. ఎటొచ్చీ జరిగిన ఈ అభివృద్ధి అంతా చింతమనేని దూకుడు స్వభావం వల్ల మరుగున పడింది. ఆయన చుట్టూ ఏర్పడిన వివాదాలే ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి.గత ఏప్రిల్ జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చింతమనేని కామ్‌గానే ఉన్నారు. ఆయన మౌనంగా ఉంటే సరిపోతుందా.. అధికారపక్షం కామ్‌గా ఉండొద్దూ..! ప్రతిపక్షంలో ఉన్పప్పుడు వైసీపీ నేతలంతా చింతమనేని చేతిలో భంగపాటుకు గురయిన వారే. అటువంటిది వారు అధికారంలోకి వస్తే చూస్తూ ఊరుకుంటారా? ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రభాకర్ ఎప్పుడు దొరుకుతాడా అని కాచుకుని కూర్చున్న వైసీపీ నేతలకు ఆయన ఓటమి అవకాశంగా చిక్కింది- అంతే, తమ పంజా విసరడం మొదలుపెట్టారు. ఈ మాజీ ఎమ్మెల్యే ఆర్ధిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని పనులను అడ్డుకున్నారు. గతంలో చేసిన ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి రావాల్సిన కోట్లాది రూపాయల బిల్లులకు మోకాలడ్డారు. అక్కడితో వారి కక్ష చల్లారలేదు. చింతమనేనిపై గతంలో నమోదయిన పోలీసు కేసులన్నింటినీ బయటకు తీశారు. చింతమనేని బాధితుల పేరుతో కొత్త అజెండాకు వైసీపీ నేతలు తెరతీశారు. ఆయన వల్ల మేము బాధలు పడ్డాము అని చెప్పుకుంటున్న వారందరితోనూ మళ్లీ కేసులు పెట్టించారు. వారందరిని కూడగట్టుకుని స్వయంగా జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయన దగ్గర బాధితుల గోడు వినిపించారు. దీంతో పోలీసు అధికారులకు వెంటనే చట్టం గుర్తుకు వచ్చేసింది. చింతమనేనిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధంచేశారు.

అవతల వ్యక్తి సామాన్యుడనుకోండి! పోలీసులు తాము అనుకున్నట్టుగా వెంటనే అరెస్ట్ చేయగలిగే వారు. కానీ అవతలి వ్యక్తి చింతమనేని ప్రభాకర్! ఎవరికీ కొరుకుడు పడని వ్యక్తిత్వం, లొంగని మనస్తత్వం ఉన్న నాయకుడు. పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తున్నారంటే చూస్తూ ఊరుకోరు కదా? వెంటనే ఆయన జంప్ అయిపోయారు. ఒకటి కాదు- రెండు కాదు.. ఏకంగా పద్నాలుగు రోజులు ఆయన మాయం అయిపోయారు. చింతమనేని ఆచూకీ కనుగొనడానికి పోలీసులు 12 బృందాలను ఏర్పాటుచేసినా ఫలితం లభించలేదు. ఆయన ఉంటారని భావించిన అనేక ఇళ్లలో సోదాలు చేశారు. ఊళ్లకి ఊళ్లు జల్లెడపట్టారు. అయినా ఏమి దొరకలేదు ఈ పరిస్థితుల్లో తానే పోలీసులకు లొంగిపోతానని చింతమనేని ప్రకటించి.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పోలీసులు మరో రకంగా ఆలోచించారు. ఆయన లొంగిపోతే కిక్కు ఏముంటుంది? మా ప్రిస్టేజ్‌ సంగతి ఏంటి? అనుకున్నారో ఏమో.. కొత్త ఎత్తుగడ వేశారు. లొంగిపోతానని ప్రకటించిన చింతమనేని తన ఇంట్లోనే ఉంటారన్న భావనకి వారొచ్చారు.  ఆ ఇంటిని పోలీసులు రౌండప్ చేశారు. ఇంట్లోకి వెళ్లి అణువణువు శోధించారు. ఎక్కడా చింతమనేని జాడ కనిపించలేదు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల చర్యను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వెడెక్కిపోయింది.

పరిస్థితి ఇలా ఉద్రిక్తంగా ఉన్నప్పుడే మాజీ ఎమ్మెల్యే చింతమనేని అక్కడకు వచ్చారు. వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచిత్రం ఏమిటంటే, అక్కడ చోటుచేసుకున్న పరిణామలన్నీ నాటకీయంగా సాగడమే! ఆ తర్వాత చింతమనేనిని కోర్టుకు, కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే ఈ కథ ఇక్కడితో ముగియలేదు. చింతమనేని అరెస్ట్‌పర్వంలో తమకు అడ్డుతగిలిన వారిపైనా పోలీసులు కేసులు బనాయించడం మొదలుపెట్టారు. హడావుడిగా నలుగురిని అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా.. అక్కడ మాత్రం వారికి ఎదురుదెబ్బ దగిలిందట.కొన్ని సాంకేతిక కారణాలతో ఆ నలుగురికి వెంటనే బెయిల్ మంజూరయ్యిందట. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, చింతమనేనిని ప్రస్తుతం ఒక కేసులోనే అరెస్ట్ చేశారట. ఇంకా ఆయనపై 62 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులే సెలవిస్తున్నారట. అంటే బెయిల్‌పై చింతమనేని బయటకు వచ్చినా, మళ్లీ వేరే కేసులో ఆయనను అరెస్ట్ చేయడానికి పావులు కదుపుతారన్న మాట! మరి ఈ అరెస్టు పర్వం, ఈ కేసుల చిక్కుముడి నుంచి చింతమనేని ఎలా బయట పడతారో . ఆయన అందరికి భిన్నం అని మరో సారి ఎలా రుజువుచేసుకుంటారో చూడాలి మరి

"
"