సీనియర్లు చెప్పేది వింటారా..? చంద్రబాబు నిర్ణయంపై ఉత్కంఠ..!

తెలుగుదేశం సర్వసభ్య సమావేశంలో సీనియర్లు చంద్రబాబుకు పాఠాలు చెప్పారు. ఆకలయినప్పుడు అన్నం పెట్టాలని, అప్పుడే అన్నం విలువ, రుచి తెలుస్తుందని అయ్యన్నపాత్రుడు.. సూటిగానే సీఎంకు చెప్పారు. అవసరం లేకపోయినా పథకాలు పెట్టి.. పసుపు -కుంకుమల పేరుతో… నిధులు పంపిణీ చేస్తే.. వారు జగన్‌కే ఓటేశారని.. ఆయన చెప్పారు. జగన్ పాలనలో రంజాన్ తోఫా ఇవ్వకపోయినా, అన్న క్యాంటీన్లను మూసివేసినా ఎవరూ మాట్లాడటం లేదని గుర్తు చేశారు. పోలవరం టెండర్లు రద్దు చేయడం, రాజదాని నిర్మాణాన్ని నిలిపివేయడం వలన వాళ్ల పార్టీలోనే వ్యతిరేకత వచ్చిందని అయ్యన్నపాత్రుడు చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష జరిపితే అసలు విషయం తెలుస్తుందని, అయ్యన్నపాత్రుడు పనికిరాడంటే తప్పించాల్సిదేనని స్పష్టం చేశారు.

ప్రజలకు చాలా చేశాం..కానీ ఇంకా ఏదో ఆశించి ప్రజలు వైసిపికి ఓటు వేశారని ,ప్రజలకు అవసరమయినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారో వెతుక్కుంటారని, అప్పుడే వెళదామని వివరించారు.అసలు ఎన్నికల సమయంలో ఏం జరిగిందో.. విశ్లేషించారు. మాటకంటే ముందే.. పడిన కష్టాన్ని .. వచ్చిన ఫలితాన్ని తల్చుకుని ఎమోషనల్ అవుతున్న అయ్యన్నపాత్రుడు… కూడా.. సూటిగానే తన అభిప్రాయాలు వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కమ్మ రాజ్యమని నిందించారని… కానీ చంద్రబాబు కమ్మవాళ్లను దగ్గరకు రానివ్వలేదని గుర్తు చేశారు. కానీ ముద్ర మాత్రం పడిపోయిందన్నారు. తిప్పి కొట్టడంలో విఫలమయ్యామన్నారు. ఎవరు పోటీచేయాలి అనే అంశంపై ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలని, చివరి నిముషం వరకు నాన్చడం మీకు అలవాటయిపోయిందని చంద్రబాబుకు అయ్యన్న సూటిగా చెప్పేశారు.గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా కాస్త ఆవేశంగానే చంద్రబాబుకు సలహాలిచ్చారు. పార్టీలో స్వార్ధపరులకు పదవులు ఇవ్వడం వలన వారు సంపాదించుకుని వెళ్లిపోతున్నారన్నారు. లోపాలను సవరించుకోవాలని, పై నుంచి కింది వరకు ప్రక్షాళన చేయాల్సిందేనని కోరారు.

పార్టీ కార్యకర్తలు, నేతలు అమరావతికి వస్తే కలిసేందుకు మీరు, లోకేష్ ఎవరూ అందుబాటులో ఉండేవారు కాదని ముఖం మీదనే చెప్పేవారు. చివరకు ఆర్టీజీఎస్ లో మీకు తప్పుడు లెక్కలు ఇచ్చారని బుచ్చయ్య అగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి యువరక్తాన్ని తీసుకురావాలని, ఆ పేరుతో కొడుకులు, కూతుర్లు, కోడళ్లకు టిక్కెట్లు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. జిల్లా కమిటీలు, రాష్ట్ర కార్యవర్గం పూర్తిగా విఫలం అయిందని, చేసింది చెప్పుకోలేక పోయామని స్పష్టం చేశారు. వీరి మాటలతో చంద్రబాబు… మారిపోయి.. పార్టీని ప్రక్షాళన చేస్తేనే.. భవిష్యత్ ఉంటుందని.. చాలా మంది నమ్మకం.