చంద్రబాబు స్వయంకృతం..! వాళ్ళు చెప్పిందే నమ్మాలా..!

“ప్రజలను ఇంత కష్టపెట్టానా..?” అని టీడీపీ అధినేత చంద్రబాబు… ఫలితాలపై ఆవేదనకు గురయినట్లు… ప్రచారం జరుగుతోంది. ప్రజల ఓటింగ్ ప్రయారిటీ ఏమిటో కానీ… ఈ ఫలితాలు రావడంలో మాత్రం.. కచ్చితంగా స్వయంకృతం ఉంది. ప్రజల్లో మారుతున్న అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు నిజాయితీగా తెలుసుకోలేకపోయారు. తాను పెట్టుకున్న కొన్ని సంస్థలు, వ్యక్తులు.. అనుకూలంగా ఉన్న నివేదికలు ఇచ్చే సరికి అదే నిజమనుకున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత అసలు నిజం తెలిసింది.

నిఖార్సైనా ఫీడ్ బ్యాక్ రావాలంటే… ఆ ఇచ్చే వ్యక్తి ఐడెంటీటీ కోరకూడదు. అలా అయితేనే .. అతను నిజం చెబుతాడు. ఊరు, పేరు, ఫోన్ నెంబర్లు అడిగి… ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏమిటి అంటే… ? టీడీపీ నేతలు ఎలా పని చేస్తున్నారు..? అని అడిగితే ఎవరైనా నిజం చెబుతారా..? ఒక్క శాతం కూడా నిజం చెప్పే అవకాశం లేదు. ప్రభుత్వానికి, అధికార పార్టీకి వ్యతిరేకంగా చెప్పి.. కష్టాలు పడే సాహసం ఎవరూ చేయరు. అందుకే.,. ప్రభుత్వం.. ఇప్పటి వరకూ.. చేసిన.. చేయించుకున్న సర్వేల్లో…. అభిప్రాయసేకరణల్లో… 70, 80 శాతం ప్రజామోదం కనిపించింది. ఆర్టీజీఎస్ సర్వేల్లో ఇదే పరిస్థితి. దీన్నే చంద్రబాబు సానుకూలతగా అనుకున్నారు. కానీ అసలు విషయం .. రహస్య ఓటింగ్‌లో తేలింది. ఇక పార్టీ పరంగా చేసుకున్న సర్వేలు… చేయించుకున్న సర్వేల్లోనూ అదే పరిస్ధితి. అనుకూల సంస్థలు, టీడీపీ నేతల వ్యవస్థలతో… సర్వేలు చేయించుకుని అంతా బాగుందని అనుకున్నారు. అంత అనుకూలత ఎలా ఉంటుంది..?. టీడీపీ నేతల వ్యవహారశైలిపై.. అంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పటికి.. ఎందుకు ప్రజల్లో వ్యతిరేకత రాదు.. అనే అంశంపై.. చంద్రబాబు దృష్టి పెట్టలేదు. కొంత మంది విశ్వసనీయమైన సర్వేల పేరుతో.. చంద్రబాబు దగ్గర ప్రాపకం కోసం… ప్రయత్నించడం..చంద్రబాబు దాన్ని నమ్మడంతో… మొదటికే మోసం వచ్చింది. అటు ప్రభుత్వ పరంగా… సరైన ప్రజాభిప్రాయం రాలేదు.. ఇటు పార్టీ పరంగా అసలైన ఫీడ్ బ్యాక్ తీసుకోలేకపోయారు.

ఫలితంగా.. మొదటికే మోసం వచ్చింది. వంధిమాగధులు ఇచ్చే సర్వే రిపోర్టులు… వారి ప్రయోజనాల కోసమే కానీ… వారికి పార్టీపైనా… ప్రభుత్వంపైనా… బాధ్యత లేదని… అంచనా వేసుకోలేకపోయారు. అన్నింటినీ గుడ్డిగా నమ్మి…కుర్చీ కిందకు నీళ్లు తెచ్చుకున్నారు. నిప్పుల కుంపటిపై దుప్పటి కప్పి… అంతా బాగుందని అనుకున్నారు. కానీ దుప్పటి కాలిపోయింది. కాలిపోతుంది కూడా. అది ప్రకృతి సహజం. టీడీపీ విషయంలోనూ అదే జరిగింది…!