చంద్రబాబు సూపర్ స్ట్రాటజీ.. హోదా కోసం మాస్టర్ ప్లాన్..!

అవును…! ఇప్పుడు ఏపీలో దాదాపు ఎవ‌రి నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. చంద్ర‌బాబు మాత్ర‌మే హోదా తీసుకురాగల రు అంటున్నారు మెజారిటీ ప్ర‌జ‌లు. కేవ‌లం ఆరు నెల‌ల కింద‌టి వ‌ర‌కు హోదాతో ఏం వ‌స్తుందో చెప్పండ‌న్న చంద్ర బాబు…హోదా ఉన్న రాష్ట్రాలు ఏం అభివృద్ధి సాధించాయ‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ఇప్పుడు యూట‌ర్న్ తీసుకున్నా కూడా.. స‌మ‌ర్ధ‌వంతంగా త‌న వాద‌న‌ను వినిపిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి ఆయ‌న యూట‌ర్న్ తీసుకుని హోదా కోసం గ‌ళం వినిపించిన‌ప్పుడు అంద‌రూ విమ‌ర్శించిన వారే. కేవ‌లం ఓట్ల కోసం ఇలా చేస్తున్నార‌ని అనుకున్న‌వారే! అయితే, రాను రాను… త‌న వ్యూహానికి ప‌దును పెట్టిన చంద్ర‌బాబు.. త‌న‌తోనే హోదా వ‌స్తుంద‌నే విష‌యాన్ని న‌మ్మించారు.

ముఖ్యంగా ఆయ‌న బీజేపీతో బంధాన్ని తెగ‌తెంపులు చేసుకుని వ‌చ్చిన ప్పుడు కూడా ఇంత రేంజ్‌లో ఎవ‌రికీ బాబుపై న‌మ్మ‌కం కుద‌ర‌లేదు. వాస్త‌వానికి అప్పుడు బీజేపీతో ఎందుకు చెడింది? దీనికి ఏవో కార‌ణాలు ఉన్నాయ‌ని చెవులు కొరుక్కున్న నాయ‌కులు, ప్ర‌జ‌లు ఇప్పుడు మాత్రం బాబు చేసిన‌ప‌నిని కొనియాడుతున్నారు. కేంద్రంతో వైరం అంటే .. రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోవ‌డం కాద‌ని ఇప్పుడు స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు. వాస్త‌వానికి ఈ విష‌యంలో వైసీపీ పూర్తిగా త‌ప్ప‌ట‌డుగులు వేసింది. చివ‌రినిముషం వ‌ర‌కు కూడా కేంద్రానికి చెమట‌లు ప‌ట్టించ‌డంలో బాబు పూర్తిగా స‌క్సెస్ అయ్యారు. ఈ ఐదేళ్ల కాలానికి చివ‌రి పార్ల‌మెంటు స‌మావేశాల‌కు మ‌రో మూడు రోజుల గ‌డువు మాత్రమే ఉంది.

దీనిని కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌క‌గా ఢిల్లీ గ‌డ్డ‌పై తెలుగు వాడి వేడిని చూపించారు. ధ‌ర్మ దీక్ష పేరుతో ఆయ‌న చేసిన 12 గంట‌ల నిరాహార దీక్ష దేశ‌వ్యాప్తంగా దుమ్మురేపింద‌ని విప‌క్ష పార్టీల‌కు చెందిన మీడియా కూడా చెప్ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చింది. అదేస‌మ‌యంలో ప‌లువురు కీల‌క నాయ‌కుల‌ను కూడా చంద్ర‌బాబు ఒకే వేదిక‌పైకి తెచ్చి ఏపీకి ప్ర‌త్యేక హోదాఇవ్వాల్సిన అగ‌త్యాన్ని వారినోటితోనే చెప్పించ‌డం ద్వారా ఫ్యూచ‌ర్‌లో ఏపీకి మంచి రోజులు ఖాయ‌మ‌నే వ్యాఖ్య ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకు వెళ్ల‌గ‌లిగారు. ఇక‌, బ‌ద్ధ శ‌త్రువు అయిన కాంగ్రెస్‌తోనూ ఆయ‌న జ‌త‌క‌ట్టి.. జై కొట్టించుకుంటున్నారు. ఇలా ఎలా చూసినా.. చంద్ర‌బాబు వ‌ల్లే హోదా ఖాయ‌మ‌నే వ్యాఖ్య ఇప్పుడు బ‌లంగా వినిపిస్తోంద‌న‌డంలో సందేహం లేదు.