చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్.. ఎం చెసుకుంటారో చేసుకోండి..

విశాఖపట్నం ప్రజలు చాలా మంచివారు.. శాంతస్వభావులు. విమానాశ్రయం వద్ద ఆందోళన చేయడానికి వచ్చినవారు బయటివాళ్లే. ఇక్కడ భూ కబ్జాలు జరిగాయి. వాటి సంగతి విశాఖ ప్రజలే తేలుస్తారు. ఇలాంటి ప్రభుత్వంపై ప్రజలే తిరుగుబాటు చేయాలి‘విశాఖ, విజయనగరంలో ప్రజాచైతన్య యాత్రకు అనుమతి అడిగితే మాకు సవాలక్ష ఆంక్షలు పెట్టిన పోలీసులు.. నన్ను అరెస్టు చేసి, ఆందోళన ముసుగులో వచ్చిన వైసీపీ కార్యకర్తలను నియంత్రించలేకపోవడం సిగ్గుచేటు. హుద్‌హుద్‌ బీభత్సంలో చెల్లాచెదురైన విశాఖ ఎయిర్‌పోర్టును మేమే దగ్గరుండి పునర్నిర్మించాం. ఇప్పుడదే ఎయిర్‌పోర్టు వద్ద నన్ను అడ్డుకోవడం విశాఖ వాసులెవరూ చేయరు. ఇది కచ్చితంగా వైసీపీ అరాచక శక్తుల పనే.. ’’విశాఖపట్నం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ‘ఏం చేస్తారయ్యా మీరు? చంపేస్తారా? అయితే షూట్‌ చేయండి…ఎన్‌కౌంటర్‌ చేయండి’… అంటూ పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. గురువారం విశాఖ విమానాశ్రయం వద్ద వైసీపీ శ్రేణుల అడ్డగింతతో సుమారు నాలుగు గంటలపాటు వాహనంలో కూర్చున్న ఆయన.. మధ్యాహ్నం మూడు గంటలకు కిందికి దిగి పార్టీ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.

 

ఆయన్ను లేపి వెనక్కి పంపే ఉద్దేశంతో పోలీసులు చుట్టుముట్టారు. వారి తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమయంలో సహనం నశించిన ఆయన ‘చంపేస్తారా… షూట్‌ చేయండి’ అంటూ పోలీసులపై ధ్వజమెత్తారు. గురువారం ఆయన విశాఖ విమానాశ్రయం వెలుపల, ప్రాంగణంలో వివిధ సందర్భాల్లో విలేకరులతో మాట్లాడారు.ముందస్తు అనుమతి తీసుకుని విశాఖపట్నం పర్యటనకు వస్తే.. వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. పోలీసులు తనకు సరైన రక్షణ కల్పించలేకపోయారన్నారు. అరగంట ఆగితే కాన్వాయ్‌ వెళ్లడానికి క్లియర్‌ చేస్తామని చెప్పి.. మూడు గంటలు దాటినా తనను పర్యటనకు పంపలేకపోయారని ఆక్షేపించారు. పైగా వెనక్కి వెళ్లిపొమ్మన్నారని.. అరెస్టు చేస్తామన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ఉన్మాది ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్‌ను చూస్తే అర్థమవుతుందన్నారు.‘రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 11 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, 25 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న నాపైనే వైసీపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేస్తుంటే పోలీసులు నిలువరించలేకపోయారు. ఇక సామాన్యులకు ఎటువంటి రక్షణ కల్పిస్తారు? నన్ను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. పోలీసుల తీరును ఖండిస్తున్నా. నా రాజకీయం జీవితంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్తాం’ అని స్పష్టం చేశారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ స్వేచ్ఛగా పాదయాత్రలు చేసుకున్నారు. ఆ విషయం మరచిపోకూడదు’ అని అన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న తనను వైసీసీ వాళ్లు అడ్డుకుంటే పోలీసులు ఏం చేస్తున్నారని చంద్రబాబు నిలదీశారు. వారి తీరు సరిగా లేదని నగర డీసీపీ-2 ఉదయభాస్కర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దాదాపు నాలుగు గంటల వరకూ ఎయిర్‌పోర్టు ఆవరణలోనే ఉండిపోయిన చంద్రబాబును అరెస్టు చేస్తున్నట్లు చెప్పి పోలీసులు వీవీఐపీ లాంజ్‌లోకి తీసుకువెళ్లారు. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు.. డీసీపీ-2తో మాట్లాడారు.

 

‘విశాఖ రావడానికి అన్ని అనుమతులు తీసుకున్నాం.. చివరకు నాకు స్వాగతం పలికేందుకు పరిమితంగా టీడీపీ శ్రేణులను అనుమతిస్తామని చెప్పినా గౌరవించాం. అటువంటిది ఎయిర్‌పోర్టు ఆవరణలోకి వైసీపీ కేడర్‌ను ఎలా అనుమతించారు? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులు ఇలాగే పనిచేశారా? జగన్‌ పాదయాత్రలో శాంతిభద్రతలు చూడాలని ఆదేశాలు వెళ్లాయి తప్ప ఎప్పుడైనా అడ్డుకోవాలని చెప్పామా? విపక్ష నేతగా రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వెళ్లే అర్హత నాకు లేదా..? ఇలాగైతే ప్రజలకు బాసటగా ఉండేదెవరు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

"
"