సంక్షేమంతో దెబ్బేస్తున్న చంద్రబాబు.. మరో పథకంతో ప్రతిపక్షాలకు చుక్కలే..?

ఏజెన్సీ ప్రాంతాల్లో 50 ఏళ్లు నిండిన గిరిజనులకు కూడా వృద్ధాప్య పింఛన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెన్సీలో ప్రస్తుతం 48,762 మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్‌దారులు వున్నారు. వృద్ధాప్య పింఛన్‌ పొందాలంటే 65 ఏళ్లు నిండాలి. అయితే ఏజెన్సీలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, ఆర్థికలేమిని దృష్టిలో పెట్టుకుని ఆదిమ జాతి గిరిజనులకు మాత్రం 50 ఏళ్లు నిండితే వృద్ధాప్య పింఛన్‌ ఇస్తున్నారు. దీంతో ఇతర తెగల్లో 50 ఏళ్లు నిండిన గిరిజనులకు కూడా వృద్ధాప్య పింఛన్‌ అందించాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఏడాది ఆగస్టులో పాడేరు నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అభ్యర్థన మేరకు 50 ఏళ్లు నిండిన గిరిజనులకు పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు.

తరువాత రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్డు ఏరియాల్లో 50 నుంచి 65 ఏళ్ల మధ్య ఎంత మంది గిరిజనులు వున్నారో అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. వీరికి 50 ఏళ్లకు పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయించి జీవో నంబర్‌ 49తో ఉత్తర్వులు జారీ చేయించారు. దీంతో విశాఖ జిల్లాలో 50 ఏళ్లు నిండిన సుమారు 15 వేల మంది గిరిజనులకు సామాజిక పింఛన్‌ కింద నెలకు రూ.2 వేల చొప్పున అందుతాయి. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల పరిధిలో వున్న వెలుగు అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభిృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారు.

ఎన్నికల కోడ్ వచ్చేలోపే..లబ్దిదారుల జాబితా ప్రకటించాడనికి దరఖాస్తుల స్వీకరణకు వెలుగు అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. వెలుగు సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆధార్‌ కార్డు ఆధారంగా 50 ఏళ్లు నిండిన వారిని గుర్తించి, వెంటనే పింఛన్‌ మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆది, సోమవారాల్లో ఏజెన్సీలో 4,951 దరఖాస్తులను స్వీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. నోటిఫికేష్ రాక ముందే వారికి పెన్షన్ మంజూరు కాబోతోంది. గిరిజనుల్లో.. ఆనందం వ్యక్తమవుతోంది.