బిగ్ బ్రెకింగ్ చంద్రబాబుపై హత్య ప్రయత్నాలు

డీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును హతమార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని విజయవాడ అర్బన్‌ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఈ కుట్రలను ఇప్పటికైనా మానుకోకపోతే పాలకుల కుతంత్రాల గురించి ప్రపంచానికి తెలిసేలా ముఖ్యమంత్రి జగన్‌ ఇంటి ముందే తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు. తమ అధినేతను కాపాడుకునేందుకు తాను చావడానికైనా సిద్ధమేనని చెప్పారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చీ రాగానే జడ్‌ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబుకు భద్రత తగ్గించారని విమర్శించారు.భద్రత పెంచాలని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోలేదని బుద్దా మండిపడ్డారు.

ప్రస్తుతం కృష్ణా వరదల వల్ల ముంపు ప్రాంతాలన్నింటినీ వదిలేసి కరకట్ట ప్రాంతంలో చంద్రబాబు నివాసం ఉన్న ఇంటి పరిసరాలను మాత్రమే డ్రోన్లతో చిత్రీకరించడం, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో సహా ముగ్గురు రాష్ట్ర మంత్రులు నేరుగా వెళ్లి చంద్రబాబు ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించినట్లుగా పరిశీలన చేయడం వెనుక ఆంతర్యాన్ని గమనిస్తే రాష్ట్ర పాలకులు చంద్రబాబును టార్గెట్‌ చేశారనే విషయం అర్థమవుతుందన్నారు.చంద్రబాబు ఇదే విధంగా టార్గెట్‌ చేసి ఉంటే రాష్ట్రంలో ఇతర పార్టీలేవీ ఉండేవే కావన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ గతంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా చంద్రబాబు పూర్తి రక్షణ కల్పించారని చెప్పారు. ‘హై సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబు ఇంటిని డ్రోన్లతో చిత్రీకరించేందుకు ఎవరు అనుమతిచ్చారని మేము ప్రశ్నిస్తే.. వరద పరిస్థితిని తెలుసుకునేందుకు డ్రోన్లతో చిత్రీకరించమని ప్రభుత్వమే పర్మిషన్‌ ఇచ్చిందంటూ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తప్పుడు ప్రకటన చేశారు.ఏ రోజు, ఎన్ని గంటలకు పర్మిషన్‌ ఇచ్చారో కంప్యూటర్లో టైమింగ్స్‌తో సహా నమోదై ఉంటుంది కదా! మంత్రి నిజంగా పర్మిషన్‌ ఇచ్చి ఉంటే ఆ వివరాలను చూపించాలి’ అని బుద్దా డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతపై తమకు నమ్మకం లేదని, అందుకే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ నాయకుడికి తగిన రక్షణ కల్పించి కాపాడాలని కోరుతూ ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్‌షాలకు తాను లేఖ రాస్తానని చెప్పారు.

వరదల వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు ముంపు ప్రాంతాల్లో అష్టకష్టాలు పడుతుంటే.. ముఖ్యమంత్రి జగన్‌ అమెరికా వెళ్లి విందులు, వినోదాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆయన విమర్శించారు. ఇక్కడ రాష్ట్ర మంత్రులేమో వరద బాధితులను గాలికొదిలేసి చంద్రబాబు ఇంటిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని బుద్దా విమర్శించారు. ఈ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా హుటాహుటిన వచ్చి వరద బాధితులకు అండగా నిలబడేవారని తెలిపారు.