చంద్రబాబు టిక్కెట్ల ప్రకటన..! ఎవరెవరికి ఇవ్వట్లేదో తెలుసా..?

టీడీపీ అధినేత చంద్రబాబు అధికారికంగా టిక్కెట్ల ప్రకటన చేయలేదు కానీ..అనధికారికంగా ఆయన నియోజకవర్గాల అభ్యర్థులకు… పని చేసుకోమని చెప్పిటన్లు ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎవరిని కొనసాగించాలి? ప్రజావ్యతిరేకత ఉన్నవారి స్థానంలో ఎవరిని బరిలోకి దించాలి? టిక్కెట్‌ లభించని నేతలకి ఎలా సర్థిచెప్పాలి? అనే అంశాలపై చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు.ఇప్పటికే అలాంటి నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీలో ఉన్న అంతర్గత సమరాలపైనా ఆరాతీస్తున్నారు. గొడవలు పడుతున్న నేతలను తనవద్దకే పిలిపిస్తున్నారు. తన సమక్షంలోనే వారితో మాట్లాడిస్తున్నారు.

ఇప్పటికే సుమారు 90 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తయింది. లోక్‌సభకి సంబంధించి మెజారిటీ నియోజకవర్గాలపైనా ఏకాభిప్రాయానికి వచ్చారు. చిక్కుముడిగా ఉన్న కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్ధులను పిలిపించి మాట్లాడుతున్నారు. ప్రజావ్యతిరేకత ఉన్న నేతలకి టిక్కెట్‌ ఇవ్వలేనని తెగేసి చెబుతున్నారు. అలాంటి నేతలకి పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చాక తగిన న్యాయం చేస్తానని నచ్చచెప్తున్నారు. పార్టీ మళ్లీ గద్దెనెక్కితేనే ఎవరికైనా పదవులు వస్తాయని ఆయన పార్టీ నేతలకు విశదీకరిస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా నాలుగు మార్గాల నుంచి సర్వే నివేదికలు రప్పించుకుంటున్నారు. ఆయా ఫలితాలను క్రోడీకరించి అభ్యర్ధుల చేతుల్లో పెడుతున్నారు.

కొందరు నేతలపై ప్రజావ్యతిరేకత ఎందుకు ఏర్పడిందో ఆయా నివేదికల్లో వివరిస్తున్నారు. లెక్కలు ఇంత స్పష్టంగా ఉంటున్నాయి కనుకనే.. టిక్కెట్లు దక్కవని తెలిసిన నేతలు కూడా ఏమి మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు. సమస్యలను చక్కదిద్దుకుంటామని చంద్రబాబుకి కొంతమంది నేతలు విన్నవిస్తున్నారు. చంద్రబాబు వాదనతో ఎక్కువమంది ఏకీభవిస్తున్నారు. పార్టీపరంగా ఒకేసారి దాదాపు 90 నియోజకవర్గాల్లో శాసనసభ అభ్యర్ధులను, 15 నుంచి 20 లోక్‌సభ స్థానాల అభ్యర్ధులను ఇప్పటికే ఖరారు చేశారు. అధికారికంగా ప్రకటించిన తర్వాత నియోజకవర్గాల్లో వారు చురుకుగా పనిచేసుకుంటారని హైకమాండ్ భావిస్తోంది