చంద్రబాబులో ఈ మార్పు చూశారా..? ఏవరూ ఊహించని ఎత్తుగడ

మామూలుగా చంద్రబాబునాయుడు… పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క అంశంపైనా స్పష్టమైన అవగాహనతో ఉంటారు. ఆయనకు ఆ నెట్‌వర్క్ ఉంది. అయినప్పటికీ… నిర్ణయం తీసుకోరు. చివరి నిమిషం వరకు ఆగుతారు. ముందుగా నిర్ణయం ప్రకటిస్తే… అసంతృప్తులు పెరిగిపోతారేమో… పార్టీకి నష్టం జరుగుతుందేమోనని.. అంచనా ఓ వైపు.. మరో వైపు.. ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటిస్తే.. వారు ప్రత్యర్థి పార్టీ ప్రలోభాలకు లొంగిపోతారేమోననే ఆందోళన మరో వైపు ఉండేది.

కానీ ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కన పెట్టేశారు. అదే సమయంలో.. ప్రత్యర్థి పార్టీ జాబితా కోసం ఎదురు చూసేవారు. కానీ ఈ సారి మాత్రం ఇతర పార్టీల గురించి.. ఇతర భయాలు.. ఆభద్రత గురించి పట్టించుకోలేదు. జాబితా ప్రకటించేశారు.అభ్యర్థుల జాబితాను… చంద్రబాబు.. ముందుగా ప్రకటిస్తారంటే.. ఎవరూ నమ్మలేదు. గతంలో చాలా సార్లు ఇదే మాట చెప్పారు కదా అని లైట్ తీసుకున్నారు. కానీ గురువారం రాత్రి పదకొండు గంటలకు.. ఒక్కసారిగా.. 126 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించేయడంతో… అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. పైగా ఇందులో.. చాలా క్లిష్టమైన నియోజకవర్గాలున్నాయి. అభ్యంతరాలున్నాయి. కానీ.. అందరి మాటలు విని.. తన నిర్ణయం మాత్రం తాను తీసుకున్నారు. దీనిపై పార్టీ నేతలు.. కూడా… ఆశ్చర్యానికి గురయ్యారు. నిజానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకూ.. అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసుకున్నారు. బలమైన అభ్యర్థులు వస్తే.. ఓ పది స్థానాల్లో చాన్సివ్వాలనుకున్నారు. ఆయా స్థానాల ప్రకటన మాత్రం నిలిపివేశారు. కొన్ని చోట్ల..లోక్‌సభ అభ్యర్థులతో మ్యాచ్‌ కావాలి కాబట్టి.. సమీకరణాల కోసం పెండింగ్‌లో పెట్టారంటున్నారు.

జోరుమీదున్న బ్యాట్స్‌మెన్… డిఫెన్స్ ఆడటానికి ఇష్టపడరు. స్టాన్స్ మార్చి.. ఫ్రంట్ పుట్‌మీదకు వచ్చేస్తారు. చంద్రబాబు జోరు ఇప్పుడు అంతే ఉంది. చకచకా నిర్ణయాలు తీసుకుని రంగంలోకి దిగుతున్నారు. ఐదేళ్ల పాటు తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో… ప్రజల్లో వచ్చిన సానుకూలతే.. ఆయన తాను ఫామ్‌లో ఉన్నాననే నమ్మకంతో ఉన్నారు. అదే పద్దతిని కొనసాగిస్తున్నారు.