చంద్రబాబు కొందరిని పక్కన పెట్టాలా…?

పార్టీకి ఎంత క్యాడర్ ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ బలపడాలి… అవును సంస్థాగతంగా ఆ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండటం, ప్రజల్లో తమకు మద్దతు ఉండటం వంటివి అధికారానికి ఎంత మాత్రం సరిపోవు. అధికారం తో పోలిస్తే ఏదైనా తక్కువే… అందుకే ఇప్పుడు పార్టీని నిర్మించాలి… ఉన్న క్యాడర్ సహాయంతో ఇటుక ఇటుక పేరుస్తూ పార్టీని బలోపేతం చెయ్యాల్సిన బాధ్యత ఉంది. ఈ క్రమంలో కొన్ని నిర్ణయాలు ఇబ్బందిని కలిగించినా సరే అధినేత చంద్రబాబు తీసుకోవాల్సిన అవసరం ఉంది.క్యాడర్ లో ధైర్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో కొందరు నేతలను ఆయన పక్కన పెట్టాలని పార్టీలో అభిప్రాయం ఎక్కువగా వినపడుతుంది.

పార్టీలో మూడు సార్లు వరుసగా ఓడిపోయిన వాళ్ళను ప్రజాక్షేత్రంలో ఉంచకుండా పక్కన పెడితే మంచిది అనే అభిప్రాయం వినపడుతుంది. రాజకీయంగా బలపడాలి అంటే ఈ నిర్ణయం అధినేత చంద్రబాబు నాయుడు తప్పకుండా తీసుకోవాల్సిందే అంటున్నారు పార్టీ కార్యకర్తలు. చంద్రబాబుకి సన్నిహితంగా ఉంటూ పార్టీలో కీలకంగా మారిన నేతలు కొంత మంది ఉన్నారు.వారి వలన పార్టీకి ప్రయోజనం ఉంటే బయటకు కనపడకుండా అంతర్గతంగా వారి సేవలను వినియోగించుకోవాలి గాని మీడియా సమావేశాల్లో వారిని తీసుకు రావొద్దని, ఇక సామాజిక వర్గాల పరంగా కూడా చంద్రబాబు కొంత మంది నేతలను అనవసరంగా మోస్తున్నారని, వారి స్థానంలో అదే సామాజిక వర్గాలకు చెందిన యువనేతల మీద ఆయన దృష్టి పెడితే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని… ఇంకెన్నాళ్ళు వాళ్ళని మోసి పార్టీని ఇబ్బంది పెడతారని అంటున్నారు.

మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఆ నేతలే చాలా వరకు కారణం అనేది కొంత మంది సీనియర్ కార్యకర్తల అభిప్రాయం. అందుకే వాళ్ళను చంద్రబాబు నెత్తి మీద నుంచి కిందకు దింపితే మంచిది అంటున్నారు.