చంద్రబాబు చెప్పిన మిషన్ 150 విజయ రహస్యం ఇదే…!

ఈ ఎన్నికల్లో టీపీపీ విజయం వంద శాతం పక్కా అని ముఖ్యమంత్రి, టీడిపి అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం మరింతగా జరగాలంటే తెలుగుదేశం పార్టీని 150కి మించిన స్థానాల్లో గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. ఐదేళ్లు చేసిన కష్టానికి కూలి అడుగుతున్నానని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ చేయనంత అభివృద్ధి, సంక్షేమం చేశామని.. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి, సంక్షేమం చేస్తానని తెలిపారు. గురువారం రాత్రి పొద్దుపోయాక ఉండవల్లిలోని ప్రజావేదికలో 126 మంది టీడీపీ అభ్యర్థులతో తొలి జాబితాను ఆయన విడుదల చేశారు.

‘మిషన్‌ 150 ప్లస్‌’ను ప్రారంభించారు. ‘మీకు మరింత మంచి జరిగేందుకు లబ్ధిదారులంతా రోడ్డెక్కాలి. మా పెద్దకొడుకు అభ్యర్థుల్ని పంపాడు.. ఆయన మళ్లీ వస్తే మరింత లబ్ధి నాకు జరుగుతుందని చెప్పాలి. మా పెద్దన్న గెలిస్తే మరింత సంక్షేమమని డ్వాక్రా మహిళలు ముందుకురావాలి. రూ.24,600 కోట్ల రుణమాఫీ చేసిన మా పెద్ద రైతు వచ్చాడు..గెలిపిద్దామని రైతులు రావాలి. చంద్రన్న వచ్చాడని యువనేస్తం యువత రోడ్డెక్కాలి. ఇవి తెలుగుదేశం పార్టీ ఎన్నికలు కావు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించేవి. అందుకే మీ భవిష్యత్‌-నా బాధ్యత అన్నా. రాష్ట్ర భవిష్యత్‌ బాధ్యతను మీరంతా తీసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు పిలుపిచ్చారు.జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్లేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు ఓటేస్తే అవమానాలు, ఇబ్బందులేనని తెలిపారు. పార్టీ అభ్యర్థుల్ని, కార్యకర్తల్ని అడిగే అభ్యర్థులను ఎంపిక చేశామని. ప్రజాభిప్రాయం తెలుసుకునే ఖరారుచేశామని చెప్పారు. ‘ఒకరిద్దరి విషయంలో ఇబ్బందులున్నా..నన్ను చూడండి. రాష్ట్ర భవిష్యత్‌ చూడండి’ అని కోరారు. ‘ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఈ ప్రభుత్వం మీది.. మీకు మేలు చేసిన ప్రభుత్వం.. మరింత మేలు చేసేందుకు సిద్ధంగా ఉన్న పార్టీని మీరే గెలిపించుకోవాలి. లబ్ధిదారులంతా తమ వంతు బాధ్యత తీసుకోవాలి. వారికి జరిగిన మేలు చెప్పాలి. చంద్రన్న వస్తే మరింత మేలు జరుగుతుందని చెప్పాలి. ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించాలి. ఇప్పుడు నన్ను బలపర్చాల్సిన బాధ్యత మీదే. ఐదుకోట్ల మంది ప్రజలు అండగా ఉండాల్సిన తరుణమిది.మీరు ఎంపిక చేసిన అభ్యర్థులు వీళ్లు. నా నిర్ణయాన్ని మీరు ఆమోదించడమే కాదు.. వీళ్లందరినీ గెలిపించాల్సిన గెలిపించాల్సిన బాధ్యతా మీదే. ఇది ఎన్నికల యుద్ధం.. ద్రోహులపై చేస్తున్న ధర్మయుద్ధం.. అభివృద్ధి కోరేవారంతా తెలుగుదేశం వెంటే. పేదల సంక్షేమం కోరేవారంతా తెలుగుదేశంతోనే. మీ అందరి మనోభావాలకు అనుగుణంగా మేం పనిచేస్తాం.

ఇప్పుడు ఎంపిక చేసిన అభ్యర్థులందరినీ గెలిపించండి. వాళ్లందరినీ పనిచేసేలా చేసే బాధ్యత నాది’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘ఈ ఐదేళ్లూ నేను పడ్డ కష్టం చూశారు. నా బృందం కష్టం చూశారు. ఉద్యోగులంతా కష్టపడ్డారు. మళ్లీ వచ్చాక మరింతగా కష్టపడతా. ఐదేళ్లలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నాం. 30 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. 19 సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి రైతులకు అంకితం చేశాం. మరో 23 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. 22 ప్రాజెక్టులు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రాఽజధాని అమరావతిలో రూ..50 వేల కోట్ల పనులు సాగుతున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ సమగ్రాభివృద్ధి ఒక సంక్షోభం. దాన్ని అవకాశంగా మలుచుకుని అభివృద్ధి చేశాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.