కేబినెటా? సంతకాలా?

రాష్ట్ర బడ్జెట్‌ 2020-21లో మూడు నెలలకుగాను ఆర్డినెన్స్‌ జారీ చేసేందుకు ప్రభుత్వం సమాయాత్తమవుతోంది. ఈ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం సమ్మతి తెలిపాకే ఆమోదం కోసం గవర్నర్‌కు పంపాల్సి ఉంటుంది. అయితే, జాతీయ స్థాయిలో కరోనా నివారణకు రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్‌లోకి వెళ్లడంతో, ఇప్పట్లో కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించడం భావ్యమా అనే అలోచనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఉన్నారు. బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశమైనప్పుడు, మంత్రులకు మంత్రులకూ మధ్య రెండు మీటర్ల దూరం ఉండేలా చూసుకున్నారు. ఇప్పుడు వెలగపూడిలోని సచివాలయంలోని కేబినెట్‌ సమావేశ మందిరంలోనూ అలాంటి ఏర్పాట్లను చేయాల్సి ఉంటుంది.

 

అయితే, స్థలం చాలకపోవచ్చునని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుట రెండు దారులు కనిపిస్తున్నాయి. ఎన్ని ప్రతికూలతలు ఎదురయినా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం వాటిలో ఒకటి. మెజారిటీ మంత్రుల సంతకాలు తీసుకుని తాత్కాలిక బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆమోదించడం రెండోవది. సామాజిక దూరం పాటించని తప్పనిసరి అయిన దరిమిలా కేబినెట్‌ సమావేశం జరపడం కన్నా ఈ రెండో ఆప్షనే బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎ్‌సజగన్మోహనరెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో మూడు మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసే విషయంలో గతం ఒకసారి ఇలాగే మెజారిటీ మంత్రుల సంతకాలు తీసుకుని ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్ర బడ్జెట్‌లో కొంత భాగాన్ని .. అంటే.. ఈ ఏడాది జూన్‌ 30 వరకూ సమ్మతించేందుకూ ఇదే విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.

 

ఈమేరకు ఒకటి,రెండు రోజుల్లోనే .. ఈ ఏడాది జూన్‌ 30వ తేదీ వరకూ ప్రభుత్వ ఆదాయ వ్యయాలతో కూడిన బడ్జెట్‌కు సంబంధించిన ఆర్డినెన్స్‌ను తయారు చేసి .. దానిపై .. 25 మంది మెజారిటీ మంత్రులు .. అంటే.. 14 మందితో సంతకాలు తీసుకునే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అమరావతికి సమీపంలోని జిల్లాలకు చెందిన మంత్రుల వద్దకు ఆర్డినెన్స్‌ ప్రతిని తీసుకువెళ్లి సంతకాలు చేయించడం ద్వారా, ప్రధాని మోదీ ఆదేశించిన 21 రోజుల లాక్‌డౌన్‌కు మద్దతును ఇచ్చినట్లుగా ఉంటుందని కూడా సీఎం జగన్‌ భావిస్తున్నట్టు సమాచారం.

"
"