బీజేపీ ఎంపీ కి బంపర్ ఆఫర్.. కేసీఆర్ నిర్ణయంతో ఆయనకు కీలక పదవి

సీఎం కేసీఆర్ తన కేబినెట్‌లో కరీంనగర్ జిల్లాకు ఈ స్థాయిలో ప్రాతినిథ్యం ఇవ్వడంతో… బీజేపీ కూడా ఈ జిల్లాకు అదే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు మెరుగయ్యాయని తెలుస్తోంది తెలంగాణలో బలపడేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్న బీజేపీ… ఇందుకోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే అనేకమంది ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ నేతలు… ఇకపై కూడా ఈ ప్రక్రియను కొనసాగించాలని భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది డిసెంబర్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీకి కొత్త అధ్యక్షులను నియమించాలని భావిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం… తెలంగాణలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని యోచిస్తోందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ స్థానంలో కొత్తవారికి అవకాశం దక్కడం దాదాపు ఖాయమనే ప్రచారం ఉండటంతో… ఆ ఛాన్స్ తమకే ఇవ్వాలని అనేక మంది బీజేపీ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కారణంగా… తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మంత్రివర్గ విస్తరణ చేపట్టిన సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కేటీఆర్, గంగుల కమలాకర్‌లకు కేబినెట్‌లో స్థానం కల్పించారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రుల సంఖ్య నాలుగుకు చేరింది.కేసీఆర్ తన కేబినెట్‌లో కరీంనగర్ జిల్లాకు ఈ స్థాయిలో ప్రాతినిథ్యం ఇవ్వడంతో… బీజేపీ కూడా ఈ జిల్లాకు అదే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు మెరుగయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కరీంనగర్ ఎంపీగా విజయం సాధించిన బండి సంజయ్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు దక్కే ఛాన్స్ ఉందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి సీఎం కేసీఆర్ తరహాలోనే బీజేపీ కూడా ఆలోచిస్తే… రాజకీయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరింత ప్రాధాన్యత దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

"
"