బీజెపీలో చేరనున్న టీఆర్ఎస్ నాయకుడు కిషన్ రెడ్డి తో రహస్య మంతనాలు

డీపీలో నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఓ నేత త్వరలో బీజేపీలో చేరుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రతి శని, ఆదివారాల్లో సికింద్రాబాద్‌ ప్రజలకు అందుబాటులో ఉంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని ఓ రోజు మధ్యరాత్రి రహస్యంగా పదిమంది కార్యకర్తలతో ఆ టీఆర్‌ఎస్‌ నేత కలిసినట్టు తెలిసింది. 2014లో కార్పొరేటర్‌ సీటు కావాలని అప్పటి డిప్యూటీ స్పీకర్‌ పద్మారావును కోరగా కుదర్లేదు.

ఈ సారీ మళ్లీ అడ్డగుట్ట కార్పొరేటర్‌గా ఉన్న విజయ కుమారికి రెండో సారీ కూడా అవకాశం ఇస్తున్నట్టు డివిజన్‌లో విస్తృత ప్రచారం జరుగుతుండటంతో ఇక లాభం లేదనుకున్న ఆ టీఆర్‌ఎస్‌ నేత పద్మారావు కార్యక్రమాలకు హాజరవుతూనే.. బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. తన భార్యకు కార్పొరేటర్‌ సీటు వస్తుందని కొండంత ఆశతో ఉంటే ఈ సారీ కూడా లాభం లేదనుకున్న ఆ నేత బీజేపీ బాటలో నడుద్దామని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.