బీజెపీ మాస్టర్ ప్లాన్ రజినికాంత్ పడతాడా..??

తమిళనాడు లోక్‌సభ ఎన్నికలు ముగిసి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీలు వ్యూహరచనలు చేస్తున్న తరుణంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కేంద్రబిందువుగా మారారు. దేశవ్యాప్తంగా మెజార్టీ రాష్ట్రాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న బీజేపీ తమిళనాడునూ తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగానే రజనీకాంత్‌ సొంతంగా పార్టీ ప్రారంభించడం కంటే బీజేపీలో చేరితే పార్టీ పగ్గాలు అప్పగించడంతోపాటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆఫర్‌ ఇచ్చినట్టు వెలువడుతున్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపట్టేలా ప్రధాని నరంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న విషయం విదితమే.

ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన లోక్‌సభ, శాసనసభ ఉప ఎన్నికల్లోను డీఎంకే కూటమి దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసింది. అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీ, పీఎంకే, టీఎంసీ, డీఎండీకే పార్టీలన్నీ ఘోరపరాజయాన్ని చవిచూశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై డీఎంకే మిత్రపక్షాలతో కలసి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ పాలనపై కూడా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు రానున్న శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల కూటములు ఇప్పటినుంచే వ్యూహాలను రచిస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం పార్టీని స్థాపించి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన నటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని ‘మక్కల్‌ నీది మయ్యం’ ఆశించిన రీతిలో ఓట్లను రాబట్టుకోలేకపోయింది. దీంతో త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకొని శాసనసభ ఎన్నికల్లో బలమైన పార్టీగా అవతరించాలని కమల్‌ భావిస్తున్నారు.