80 శాతం సంతృప్తి ఎలా ఫెయిల్ అయిందంటే… బాబుని ఆ మాయలో పెట్టిందెవరు..?

రాష్ట్ర ప్రజలలో 80 శాతానికి పైగా సంతృప్తి ఉంది అని అధికారులు పక్కాగా గణాంకాలతో చెప్పడంతో చంద్రబాబు కూడా అంతకుమించి సంతృప్తి సాధనే లక్ష్యమని ప్రకటించారు. కానీ ఎన్నికల ఫలిరాల తర్వాత కానీ అసలు వాస్తవం వెల్లడి కాలేదు. డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌, కీ ఫెర్‌ఫార్మెన్స్‌ ఇండెక్స్‌, వయాడక్ట్‌, ఐవీఆర్ఎస్‌ సర్వే, శాటిస్ ఫ్యాక్షన్‌ లెవెల్‌… అభివృద్ధిని, ప్రజాభిమానాన్ని కొలవడానికి తెలుగుదేశం సర్కారు అనుసరించిన విధానాలివి! విచిత్రమేమిటంటే… ఇవేవీ ఎన్నికల్లో ఫలితాలను ఇవ్వలేదు. ఇవి సామాన్య ప్రజలకు అర్థం కాలేదు.

పైగా… ఇదేదో అంకెల గారడీ అనే అనుకున్నారు. నిజానికి… కొందరు అధికారులే చంద్రబాబును ఈ విషయంలో తప్పుదోవ పట్టించారని టీడీపీ నేతలు మొదటి నుంచీ వాపోతున్నారు. 1100 కేంద్రం ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండటం వాస్తవం. అయితే… ఆ సంస్థ చేసిన సర్వేలు, ఇచ్చిన లెక్కలు మాత్రం వాస్తవాలను దాచిపెట్టాలా, మభ్యపెట్టేలా ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వ పథకాలపై సర్వేలు చేయడం, దానిపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? లేదా? అన్న దానిపై 1100ద్వారా లెక్కలు తీశారు. 60 శాతంతో మొదలైన ఈ ‘సంతృప్తి’ లెక్కలు క్రమంగా 80 శాతానికి చేరాయి. ‘‘నిజంగా అంత సంతృప్తి ఉందా? ఇదంతా లెక్కల గారడీలా ఉంది! జాగ్రత్తగా చెక్‌ చేసుకోవాలి సార్‌!’ అని పలువురు నేతలు, అధికారులు చంద్రబాబుకు చెప్పారు. కానీ… ఆయన మాత్రం సర్వేలు చేసినవారినే సమర్థించారు. పైగా, ప్రతి సమీక్షలో ఈ సంతృప్తి లెక్కలను వివరిస్తూ, మరింత పెరగాలని చెబుతూ వచ్చారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి 1100ను ఉపయోగించుకోవడం నిజం. అంతే తప్ప, తమ అ సంతృప్తి లేదా సంతృప్తి వ్యక్తం చేయడానికి దీనిని వాడలేదు. ఒకవేళ… ‘అసంతృప్తి’తో ఉన్నట్లు చెప్పినప్పటికీ, ‘అంతా బాగుంది’ అనే కలరింగ్‌తో చంద్రబాబును మభ్యపెట్టారని చెబుతున్నారు. ప్రభుత్వం పట్ల నిజంగానే ప్రజల్లో అంత సంతృప్తి ఉంటే… ఇంత ఘోర పరాజయం ఎందుకు ఎదురవుతుంది! 1100 సంతృప్తి లెక్కల్లో డొల్ల తనానికి ఇదే నిదర్శనం. చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘ఆర్భాటమైన’ పదజాలాన్ని ఉపయోగించుకున్నారు. సామాన్యులను హత్తుకునేలా చెప్పడంలో విఫలమయ్యారు.

డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ సాధించామని చెప్పడం, వయాడక్ట్‌ పద్దతిలో వెళ్లామని అనడం, సాంకేతిక అంశాలపై ఎక్కువగా ఆధారపడడం, రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలాంటి పదాలు, లెక్కలు ప్రజలకు పట్టలేదు. చేసిన దాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యే భాషలో సరిగా చెప్పలేకపోయారని అంటున్నారు. ఈ విషయాలను అప్పుడప్పుడు ఎవరైనా నేతలు, లేదంటే కొందరు అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదని అంటున్నారు. వాస్తవాలు తెలుసుకుని మేలుకుని ఉంటే పరిస్థితి కనీసం ఇంత ఘోరంగా ఉండేది కాదంటున్నారు.