ప్రకాశంలో క్లిన్ స్వీప్… చంద్రబాబు వ్యూహం… రంగంలోకి కీలక నేత…!

పోయిన ఎన్నికల్లో కొంత నిరాశ పరిచిన ప్రకాశం జిల్లాలో ఈసారి క్లిన్ స్వీప్ చేయాలనీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇందుకోసం ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ముందుగా జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకర్గాల్లో క్షేత్రస్థాయిలో అసమ్మతివాదుల బుజ్జగింపులు, సర్దుబాట్లకు టీడీపీ శ్రీకారం పలికింది. ప్రధానంగా ఒంగోలు లోక్‌సభ స్థానంపై ప్రత్యేక దృష్టిసారించింది. మరోవైపు సిట్టింగ్ సీటు బాపట్ల లోక్‌సభ పరిధిలోని ఎస్ఎన్‌పాడులో నెలకొన్న సమస్య పరిష్కారానికి కూడా నేతలు చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్సీ, ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించిన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈనెల 4న మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. సమయం ముంచుకొచ్చిందని, సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని ఆయన చంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన అధినేత వెంటనే కిందిస్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించి ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిసింది.

ముఖ్యమంత్రి సూచనలతో జన్మభూమి అనంతరం 12వతేదీ నుంచి నియోజకవర్గాల వారీ సమీక్షలకు శ్రీకారంచుట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే పార్టీ మార్కాపురం ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి ముందుగానే ప్రకటించి ఉండటంతో శుక్రవారం ఆ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. శనివారం ఎస్ఎన్‌పాడు అసమ్మతి నాయకులతో ఒంగోలులో సమావేశం జరగనుంది. మార్కాపురంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఆ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి అసమ్మతివాదుల్లో కొందరు గైర్హాజరయ్యారు. అందులో మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి సమీప బంధువులు కూడా ఉన్నారు. ఈ సమావేశాన్ని ఈనెల 12 తర్వాత నిర్వహించి లోక్‌సభ అభ్యర్థి మాగుంటతోపాటు, మంత్రులు శిద్దా, నారాయణ కూడా హాజరుకావాలని భావించారు. అయితే ఈనెల 21 నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్న నారాయణరెడ్డి ఆ విషయంపై చర్చించేందుకు శుక్రవారం సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి ఎమ్మెల్సీ కరణం బలరాం, పార్టీ ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడు దివి శివరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు అందరినీ కలుపుకుపోతున్నానని, మున్ముందు కూడా ఆ విషయంలో లోపం రానివ్వనని చెప్పినట్లు తెలిసింది. నియోజకవర్గంలో ఈనెల 21 నుంచి నిర్వహించనున్న పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రకటించి ఆమోదాన్ని పొందారు. అందరి అభిప్రాయాలను విన్న తర్వాత బలరాం, శివరాం మాట్లాడుతూ గతాన్ని వదిలేసి పార్టీని గెలిపించుకునేందుకు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పార్టీ చూసుకుంటుందని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి గైర్హాజరైన కృష్ణారెడ్డి, రామిరెడ్డి, కాశీనాథ్‌లను ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఒంగోలు వచ్చి కలవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది.

ఇక బాపట్ల లోక్‌సభ పరిధిలో ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గంలోని అసమ్మతి నాయకులతో శనివారం పార్టీ ముఖ్య నాయకులు భేటీ కానున్నారు. ఆ మేరకు శనివారం మధ్యాహ్నం 3గంటలకు ఒంగోలులోని ఎమ్మెల్సీ మాగుంట నివాసంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని పార్టీ కార్యాలయం నుంచి వారికి సమాచారం అందింది. సమాచారం అందుకున్న వారిలో నాగులుప్పలపాడు ఎంపీపీ వీరయ్య చౌదరి, ఎస్ఎన్‌పాడు ఎంపీపీ అనిత, ఆమె భర్త రమేష్‌, మద్దిపాడు ఏఎంసీ చైర్మన్‌ పమిడి వెంకట్రావు, మాజీ చైర్మన్‌ మండవ రంగారావు, టంగుటూరు మాజీ సర్పంచ్‌ జయంత్‌బాబు తదితరులు ఉన్నట్లు తెలిసింది. అక్కడ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేయకుండా అసమ్మతితో ఉన్న నాయకులను పిలిచి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గత ఏడాది నవంబర్‌ 3న వీరందరితో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యక్షంగా మాట్లాడారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మంత్రులు శిద్దా, నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌, ఎమ్మెల్సీలు బలరాం, మాగుంట, దివిశివరాం తదితర ముఖ్యులంతా వారితో భేటీ కానున్నట్లు తెలిసింది.