చంద్రబాబు లైన్లోకే కాంగ్రెస్ నేతలు..!

ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధంగా లేరు. ఈ విషయం కాంగ్రెస్ నేతలు కనిపెట్టారు.అందుకే… చంద్రబాబు కూడా పొత్తుకు దూరం .. దూరం అంటూడటంతో… ముందస్తుగా తామే పొత్తు వద్దని.. కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు కానీ… కాంగ్రెస్ పార్టీలో మిగిలి ఉన్న కొంత మంది సీనియర్ల ఆలోచన మాత్రం వేరుగా ఉంది. అసెంబ్లీ సీట్లు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు.. ప్రత్యేకహోదా కోసం అయినా… మూడు, నాలుగు పార్లమెంట్ సీట్లు కేటాయించేలా చూడాలని… వారు హైకమాండ్ పెద్దలతో.. సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచాతరం జరుగుతోంది.

రఘువీరారెడ్డి, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, పళ్లం రాజు, కిల్లి కృపారాణి లాంటి నేతలు ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఇలాంటి వారి కోసం… లోక్‌సభ సీట్లు ఇప్పిస్తే చాలని… వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. కానీ చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్నదే కీలకం..! ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం, సీట్లు కేటాయించడం తెలుగుదేశం పార్టీకి సుతారమూ ఇష్టం లేదు. ఆ విషయాన్ని చంద్రబాబునాయుడు సున్నితంగానే రాహుల్ గాంధీకి చెప్పి వచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అనూహ్యంగా ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా… తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని రాహుల్‌కు చెప్పామని చెప్పుకోవడం ప్రారంభించారు.

జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు… కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా మద్దతు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. అయితే.. ఏపీలో పరిస్థితులు మాత్రం భిన్నం. ఏపీ ప్రజల్లో ఇంకా.. విభజన ఆగ్రహం చల్లారలేదు. పైగా… కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి క్యాడర్ లేదు. ఉన్న క్యాడర్ మొత్తం ఎప్పుడో… వైసీపీలో చేరిపోయారు. లీడర్లు కూడా లేరు. ఇలాంటి సమయంలో… కాంగ్రెస్‌తో కలసి నడవడానికి చంద్రబాబు సిద్ధమవడానికి కారణం ప్రత్యేకహోదానే. కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న … ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని… ప్రకటిస్తున్న కాంగ్రెస్ కాబట్టి… చంద్రబాబు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది జాతీయ స్థాయి కాబట్టి.. అక్కడ మద్దతిస్తే సరిపోతుందన్నది చంద్రబాబు అభిప్రాయం. చంద్రబాబుకు కావాల్సిందే… కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందుకే .. కాంగ్రెస్ తో పొత్తు అనే మాటే ఏపీలో వచ్చే అవకాశం లేదు.