బాబు కోసమే ఈ జీవితం… చంద్రబాబుని వీడి వెళ్లే ప్రసక్తే లేదు..

టీడీపీలో కొందరు నేతలున్నారు. వారికి చంద్రబాబు మీద విపరీతమైన గురి. వారికి ఆయన నాయకత్వమే శిరోధార్యం. ఆయన మాట జవదాటరు. ఆయన గీసిన గీతను దాటరు. అలాంటి నేతలు ఇప్పటికీ… ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లోనూ చంద్రబాబు పట్ల అదే విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. మాజీ సీఎం తమ్ముడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ కోవలోకే వస్తారు. తాను తెలుగుదేశం పార్టీని వదిలే ప్రసక్తే లేదని ఇందులో కార్యకర్తలెవరూ గందరగోళానికి గురి కావలసిన అవసరం కూడా లేదని పీలేరు టీడీపీ ఇన్‌చార్జి, మాజీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.

తన రాజకీయ భవిష్యత్తు గురించి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని ఆయన తోసిపుచ్చారు. కలికిరి అమరనాథ రెడ్డి భవన్‌లోని కార్యాలయంలో శనివారం ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ కష్ట కాలంలో చంద్రబాబును వదిలి వెళ్లే ప్రసక్తే లేదని, కష్టమైనా, నష్టమైనా ఆయన వెన్నంటి వుండటమే తన ధర్మమని కూడా తేల్చి చెప్పారు.ఏ పార్టీ వుంటుంది, ఏ పార్టీ పోతుంది, ఎవరు బలపడతారనే విశ్లేషణలు కూడా తనకు అవసరం లేదని కేవలం నైతిక నిబద్ధతతోనే చంద్రబాబుకు వెన్నంటి టీడీపీతోనే వుంటానని వివరించారు. గతంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అనేకసార్లు జిల్లాకు వచ్చినా తాను ఎప్పుడూ ఎయిర్‌పోర్టుకో లేక కుప్పంకో స్వాగతాలు పలకడానికి వెళ్ళలేదన్నారు. అయితే గత వారం చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మొదటిసారి బెంగుళూరు విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికానని, ఆయనకు నైతిక స్థైర్యం కలిగించడం కోసం కుప్పం వరకూ కలిసి వెళ్ళానని చెప్పారు. గత ఎన్నికల్లో కార్యకర్తలంతా హోరాహోరీ పని చేశారని నియోజకవర్గంలో టీడీపీ బలంగా వుందని నిరూపించారన్నారు.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్క పీలేరు నియోజకవర్గంలో మాత్రమే 2014 ఎన్నికలకన్నా టీడీపీ ఓట్లు గణనీయంగా ఒకటిన్నర రెట్లు పైబడి పెరిగాయని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగం, శ్రేణులు సమాయత్తం కావాలని సూచించారు. మాజీ కలికిరి జడ్పీటీసీ చంద్రకుమార్‌ రెడ్డితోపాటు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు ఈ సమాలోచనల్లో పాల్గొన్నారు. అనంతరం కిశోర్‌కుమార్‌ రెడ్డి గ్రామాల వారీగా అందరినీ పిలిచి విడివిడిగా మాట్లాడారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలో వారితో చర్చించారు.