బాబు కోసం మంత్రి అచ్చ‌న్న ఏం చేశారో తెలుసా..!

ఏదీ ఊరికే రాదు. ఏది సాధించాల‌న్నా చాలా కృషి ఉండాలి. ఎంతో ప‌రిశ్ర‌మ ఉండాలి. అంత‌కు మించిన ప్ర‌యాస కూడా ఉండాలి. ఇక‌, రాజ‌కీయాల విష‌యానికి వ‌స్తే.. మ‌రింతగా ప‌రిశ్ర‌మించాలి. ప్ర‌త్య‌ర్థుల ఆనుపానుల‌ను క‌నిపెడుతూ.. త‌న‌దైన శైలిలో ముద్ర‌వేయాలంటే.. మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించాలి. ఇవ‌న్నీ ఉంటే త‌ప్ప‌.. రాజ‌కీయంగా ఎద‌గ‌డం, అనుకున్న‌వి సాధించ‌డం అంత ఈజీకాదు. వీట‌న్నింటినీ రాజ‌కీయంగా పుణికి పుచ్చుకున్న మంత్రి అచ్చ‌న్నాయుడు ఏం చేసినా వైవిధ్యంగానే ఉంటుంది. ఎంతో సౌమ్యుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. అంతకు మించి గ‌ట్టి గ‌ళం ఉన్న నాయ‌కుడిగా గుర్తింపు సాధించారు.

టెక్క‌లి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అచ్చ‌న్నాయుడు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర పూర్తిస్థాయిలో మార్కులు కొట్టేశారు. వివాద ర‌హితుడిగా ఆయ‌న పేరుతెచ్చుకోవ‌డం కొత్త‌కాదు, కానీ, అధినేత చంద్ర‌బాబు అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. అంత‌కు మించి త‌మ‌కు రాజ‌కీయ భిక్ష పెట్టిన టీడీపీ అంటే మ‌రింత ప్రాణం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకు వ‌చ్చేందుకు మీకు తెలిసిన వ్యూహాలుంటే చెప్పాలి చంద్ర‌బాబు కొన్ని రోజుల కింద‌ట అమ‌రావ‌తిలో మంత్రుల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. నిజానికి అప్ప‌టి వ‌ర‌కు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చ‌న్నాయుడు ఈఎస్ ఐ ఆస్ప‌త్రుల్లో సేవ‌లు పెంచ‌డం, చంద్ర‌న్న‌ బీమాను మ‌రింత‌గా పెంచి రూ.5 ల‌క్ష‌లు చేయ‌డం వంటి కీల‌క అంశాల‌పై నోట్ త‌యారు చేసుకున్నారు. అయితే, ఈ స‌మావేశం జ‌రిగే నాటికి ఆయ‌న ర‌వాణా శాఖ మంత్రి అయ్యారు. మ‌రి ఇప్పుడు ఏం చేయాలి? ర‌వాణా శాఖ‌లో ఏం చేస్తే బాగుంటుంది. ద‌ళారీల‌ను అరిక‌ట్టాలి. దీనివ‌ల్ల వ‌చ్చే ఓటు బ్యాంకు ఏముంటుంది? పైగా వ్య‌తిరేక‌త త‌ప్ప‌! ఈ క్ర‌మంలో ఆయ‌నకు ఏమీ పాలుపోలేదు. అయితే, బాబు అడిగిన మాట ప్ర‌కారం.. పార్టీ ని తిరిగి అధికారంలోకి తీసుకు వ‌చ్చేందుకు ఏదైనా వ్యూహం ఆలోచించాల‌నినిర్ణ‌యించుకున్న అచ్చ‌న్న‌కు హ‌ఠాత్తుగా ఓ వ్యూహం వెలుగులోకి వ‌చ్చింది. అదే ఆటో స‌హా ట్రాక్ట‌ర్ల‌కు జీవిత‌కాల రోడ్లు ట్యాక్స్‌ను మిన‌హాయించ‌డం. ఇది క‌నుక చేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ల‌క్ష‌ల కుటుంబాలు ఆధార‌ప‌డి ఉన్న ఆటోరంగంలోని వారంతా కూడా టీడీపీకి అనుకూలంగా మార‌తార‌ని ఆయ‌న భావించారు. అనుకున్న‌దే త‌డువుగా చంద్ర‌బాబుకు చెప్పారు.

తొలుత దీనిపై అభ్యంత‌రాలు వ‌చ్చినా.. అచ్చ‌న్న వ్యూహం బాగుంద‌ని మెచ్చుకున్న వెంట‌నే ఓకే చెప్పారు. దీని ఫ‌లితంగానే ఇటీవ‌ల చంద్ర‌బాబు ఆటోలకు జీవిత కాలం పన్ను మినహాయిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల‌కు, రైతుల‌కు కూడా ఆనందం నింపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు, వ్యవసాయ పనుల్లో విని యోగించే ట్రాక్టర్లకు సంబంధించి జీవిత కాలం పన్ను రద్దు చేసిన నేప‌థ్యంలో ఆవ‌ర్గం ఓట్లు గుండుగుత్తుగా సైకిల్ ఎక్క‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి ఈ వ్యూహం వెనుక ఇంత శ్ర‌మ ఉంద‌న్న‌మాట‌. ద‌టీజ్ అచ్చ‌న్నాయుడు.